పుట:Naajeevitayatrat021599mbp.pdf/308

ఈ పుట ఆమోదించబడ్డది

సహకార నిరాకరణ కార్యక్రమానికి దిగుతాం అని చెప్పడానికి బదులు, రహస్య సంఘాల స్థాపన ప్రస్తావన తీసుకు వచ్చారు. ఆయన ఆవేశపూరితు లయినప్పుడు, తాను ఉచ్చరిస్తూన్న పదాలు ఎటువంటి పరిణామాలకు తీసుకు వెడతాయోనన్న ఆలోచనలేకుండా, తొందరపాటుతో ఇల్లా కాస్త తబ్బిబ్బు అవడం మామూలే. అప్పట్లో బెంగాలులో విప్లవ వాతావరణం తల ఎత్తడమూ, దానిని ప్రభుత్వం దయాదాక్షిణ్యాలు లేకుండా ఛిన్నాభిన్నం చెయ్యడమూ జరిగాయి. చైనా, జపాను మొదలైన దేశాలలో ఉన్నట్లుగా మనదేశంలో అలాంటి రహస్య సంఘాల స్థాపనకు అనువైన వాతావరణం లేకపోయినా అలజడి మాత్రం కలిగింది. అంతేకాదు, అటువంటి విప్లవ వాద సంఘాలను గురించి మోతిలాల్ వంటివారు ప్రస్తావించారంటే వారికి అహింసా తత్వంమీద అపనమ్మకం ఉందా అనే అనుమానం కలుగుతుంది.

ఆ రోజులలో నేను విస్తారంగా విదేశాలలో పర్యటిస్తూ ఉన్నప్పుడు, ఇలాంటి రహస్య సంఘాల, సంచలనాల వార్తలు చెవిని బడుతూనే వుండేవి. నేను సింగపూరులో 1920 లో పర్యటిస్తూండగా పరిచయం ఉన్న ఒక డాక్టరుగారి కారులో, ఆయనతో కలిసి ఆ పరిసరాలలో ఉన్న ఒక గ్రామానికి వెళ్ళాను. ఆ కారు స్వయంగా డాక్టరుగారే నడుపుతున్నాడు. ఆ రాత్రి తిరుగు ప్రయాణంలో రోడ్డు మీద మాకు ఒక శవం కనబడింది. ఆయన కారు ఆపుజేశారు. ఉభయులమూ దిగి ఆ శరీరాన్ని పరీక్ష జేశాము. శరీరంనిండా తుపాకీ తూట్లు కనబడ్డాయి. డాక్టరుగారు ఆ విషయాలన్నీ తమ నోటు బుక్కులో నోటు చేసుకున్నాకనే ముందుకు సాగాము. కొంతదూరం వెళ్ళాక మాకు దారిలో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు తారసపడ్డారు. డాక్టరుగారు కారు ఆపుజేసి, భోగట్టా చేశారు. అంతక్రితమే రోడ్డు మీద రెండు రహస్య సంఘాలమధ్య ఘర్షణ జరిగిందనీ, ఇరుపక్షాలకు మధ్యా బాహాటంగా కాల్పులు జరిగాయనీ వారు చెప్పారు. సాధారణంగా సంఘర్షణ జరిగిన వెంటనే చనిపోయినవారి శవాలను అంతు చిక్కకుండా తొలగించేస్తారని వారు అన్నారు. ఆ దేశం మొత్తంమీద