పుట:Naajeevitayatrat021599mbp.pdf/304

ఈ పుట ఆమోదించబడ్డది

వరకూ దాస్‌గారు మాత్రమే తంటాలు పడగలిగారు. ఒకమాటు దాస్‌గారు సుస్తీగా ఉండి అసెంబ్లీకి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడినప్పుడు, ఆయన పార్టీవారు సందిగ్దంలో పడి, కింకర్తవ్యతా మూడులయి ఊగిసలాడారు. సంగతులు ఇలా పరిణమిస్తాయనో, పరిణమించాయనో కనిపెట్టిన దాస్‌గార్ని స్ట్రెచ్చర్‌మీద అసెంబ్లీకి తీసుకురావడంతో పరిస్థితి చక్కబడి, సహకార నిరాకరణం చక్కగా సాగింది. ఆ రోజులలో కూడా సహకారాభిలాష ఉండేది.

ఈ విధంగా, లోపల ఉండి అడ్డంకులు తీసుకురావాలనే స్వరాజ్యవాదుల అభిలాష, క్రమేపీ 1924-25 సంవత్సరాల నాటికి, తమ ఉద్దేశాలకు, ఆదర్శాలకూ అనుగుణంగా, దేశసౌభాగ్యానికి దోహదం చేసే తీర్మానాల విషయంలో సహకరించాలనే పద్ధతికి మారిపోయింది.

లార్డ్ బర్కెన్ హెడ్ అప్పట్లో సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా ఉండేవాడు. తియ్యటి మాటలతో స్వరాజ్య పార్టీవారిని మెల్లి మెల్లిగా తనవైపు త్రిప్పుకోగలిగాడు. "భారతీయులు మాకు హృదయపూర్వక సహకారం ఇచ్చిననాడు, మేము పిసినిగొట్లలా బేరాలాడం" అన్నాడాయన. ఇల్లాంటి కబుర్లతో మానవ హృదయాలను ఆకట్టుకోగల శక్తి ఆయనకుంది. 1926 ప్రారంభ దినాలలో, దక్షిణ ఆఫ్రికా భారతీయుల తరపున వైస్రాయితో ప్రసంగించడానికి, పండిత మోతిలాల్ నెహ్రూగారూ, లాలా లజపతిరాయిగారూ కలసి వైస్రాయి మందిరానికి వెళ్ళినప్పుడు ఆ మాటలు మళ్ళీ విన్నారు. అప్పటికి సహకార నిరాకరణ ఉద్యమం ఆరంభమయి అయిదు సంవత్సరాలయింది.

1922 లో గాంధీగారి నిర్భంధంతో పాలకులు కాంగ్రెసులో విభేదాలు తీసుకు రాగలిగారు. గాంధీగారికి దేశంలో పలుకుబడి తగ్గిందనీ వారికి గ్రాహ్యం అయింది. దాస్-మోతిలాల్‌గార్లు ఎప్పుడయితే తాము నిర్భంధంలో ఉంటూ కూడా, గాంధీగారిని విమర్శింప సాగారో, అప్పుడే గాంధీగారి పలుకుబడి దేశంలో సన్నగిల్లుతోందని నిర్ధారణ అయింది. కాగా ఆ పరిస్థితుల్ని గమనించే, జైళ్ళల్లో ఉన్న దాస్-మోతిలాల్‌గార్లకు, గాంధీగారిని కాదని, రాజీ ప్రతిపాదనలు సూచిం