పుట:Naajeevitayatrat021599mbp.pdf/296

ఈ పుట ఆమోదించబడ్డది

పెట్టి నాకు యెన్నోసార్లు వారింట భోజనం పెట్టారు. ఆయన కుమార్తె, మేనకోడలూ నాకు ఎదురుగా కూర్చుని, వండిన రకరకాల వంటకాలన్నీ నాచేత బలవంతంగా మొహమాట పెట్టి మరీ తినిపించేవారు.

మహానాయకుడు

ఆయన జీవించి ఉన్న రోజులలో ఆయనతో తుల్యమయిన నాయకుడు లేడు. ఆయన తర్వాతకూడా అంతటి నాయకుడు ఉండడనే ఘంటాపథంగా చెప్పవలసి ఉంటుంది. ఆయన పోయింది లగాయితు ఈ రోజువరకూ బెంగాలు రాష్ట్రం, ఏ శనిగ్రహచ్ఛాయలలోనో ఇరుక్కుని తబ్బిబ్బవుతోందని అనక తప్పదు.

నేను వర్కింగు కమిటీలో ఉంటూన్న రోజులలో, అనగా-దాసుగారు మంచి ఉచ్చస్థితిలో ఉన్న రోజులలో, ఆయనకు రాజకీయంగా చాలామంది పోటీదార్లూ, విరోధులూ ఉండేవారు. వారెప్పుడూ వర్కింగు కమిటీముందు దాస్‌గారి మీద తీవ్రమయిన ఆరోపణలూ, ఫిర్యాదులూ చేసెవారు.

ఆయన కాంగ్రెసు మెంబర్ల లిస్టును ఇష్టంవచ్చిన చేర్పులూ, మార్పులూ, కొట్టివేతలతో నింపి చాలా అయోమయంగా ఉండేవాడని, పిర్యాదు ఉండేది. ఈ విషయంలో వర్కింగు కమిటీవారు విచారణ చేయక తప్పలేదు. ఆయనా వర్కింగు కమిటి మెంబరే అయినా, ఆయన విషయంలో విచారణ జరుగనున్నదని తెలిస్తే వెంటనే బయటికి వెళ్ళి, ఆ విచారణ పూర్తయ్యాకే తిరిగివచ్చి కమిటీతో కలిసేవాడు. ఆ విచారణ కాలాన్ని బాగా సాగదీశారు. అనేక ప్రాంతలలో జరిగిన వర్కింగ్ కమిటీ మీటింగులలో దాసుగారిపై మోపబడిన పిర్యాదులు విచారణకు రావడమూ, అట్టి విచారణ సమయాలలో ఆయన మీటింగు నుంచి నిష్క్రమించడమూ, మామూలే అయింది. ఏదయిదేనేం, చివరికి ఆయనపట్ల ఆరోపించబడిన లోట్లేవీ ఆయనవద్ద లేవనీ, మోపబడిన నేరాలన్నీ గాలిమూటలే నని గౌరవ పురస్సరంగా తెలియ జేశారు.