పుట:Naajeevitayatrat021599mbp.pdf/281

ఈ పుట ఆమోదించబడ్డది

గాంధీగారిని అధ్యక్షత వహించ వలసిందని అనుచరులందరూ కోరి ఒప్పించారు. కాని ఆయన ఆ కాంగ్రెసు అధ్యక్ష పదవి అంగీకరించకుండా ఉండవలసింది. ఆయన శక్తి సామర్థ్యాలు కాంగ్రెసు ప్రెసిడెంటు పదవి నలంకరించనంత మాత్రము చేత తరిగిపోయేవి కాదు. ఆయన్ని కాంగ్రెసు అధ్యక్ష పదవికీ అంగీకరించమని, ఎవరెవరు ప్రోత్సహించారో, ఏ ఉద్దేశంతో ప్రోత్సహించారో నాకు తెలియదు. గాంధీగారితో ఆనాడుగాని, ఈనాడుగాని త్రివిధ బహిష్కార విధాన తాత్కాలిక విరమణకు కారకులు ఆనాడు వర్కింగు కమిటీలో నున్న ఆయన ముఖ్య అనుచరులయిన నమ్మినబంట్లే నన్న సంగతి ఎవరయినా చెప్పారో లేదో నాకు తెలియదు. "కౌన్సిల్ యెంట్రీ" విధానంలో దరిమిలా జరిగిన అల్లకల్లోలాలన్నీ ఆయన చెవిని పడ్డాయో లేదో నాకు తెలియదు. బహుశ:ఆయన ఆ క్షణంలో మనో దౌర్బల్యంవల్ల అనాలోచితంగా కాంగ్రెసు అధ్యక్ష పదవిని అంగీకరించి ఉంటారు. దరిమిలా 1931 లో కూడా ఆయన అటువంటి అనాలోచిత కార్యానికే అంగీకరించారు. రెండవ రౌండ్ టేబిల్ సమావేశానికి వెళ్ళడానికి ఒప్పు కోవడమే ఆ 31 నాటి అవివేక కార్యం అని నా ఊహ.

స్వరాజ్యవాదులకు కాంగ్రెసు అప్పగింత

గాంధీగారికి వ్యతిరేకంగా పనిచేసే శక్తులు ఎంత మాత్రంగా ఉన్నాయో గ్రహించి, వాటిని ప్రోత్సహించి తమ వైపు త్రిప్పుకోవాలనే ఉద్దేశంతో దాస్-మోతిలాల్‌గారలు బెల్గాం కాంగ్రెసుకు హాజరవుతూన్న ప్రతినిధుల నందరినీ పలకరించి చూశారు. నిజమే. గాంధీగారు నిర్భంధంలో ఉన్న ఆ రెండు సంవత్సరాలలోనూ దేశంలో ఏర్పడిన చీలికలు, కలిగిన పరిణామాలూ, నాయకుల మధ్య నడచిన వాదోప వాదాలూ, పరిస్థితుల మార్పులూ మొదలయినవన్నీ దేశీయులలో మానసిక ఆందోళన కలిగించాయన్న సంగతి నిశ్చయమే. అనుమానం యెంత మాత్రం లేదు. కాని గాంధీగారు స్వయంగా హాజరయిన ఏ సభలోనూ, ఎటువంటి క్లిష్ట పరిస్థితులలోనూ కూడా, ఆయనకు అపజయమన్నది లేనేలేదు.