పుట:Naajeevitayatrat021599mbp.pdf/279

ఈ పుట ఆమోదించబడ్డది

భుజస్కంధాలపైనే మోపబడ్డాయి. సాంబమూర్తిగారు కూడా నాకు మల్లేనే ప్లీడరీలో బాగా ఆర్జించిన వారే అయినా, ఉద్యమంలో చేరాక మా యిద్దరి స్థితీ ఒక్కలాగే నడిచింది. ఇద్దరమూ పకీర్లమే. ఇద్దరమూ దేశ ద్రిమ్మర్లమే. అయితేనేం, లేమితో ఎప్పుడూ మేము బాధపడలేదు. అడగడం తడవుగా డబ్బు అల్లా పుట్టేది. వారి ప్రయత్నం సఫలం అయింది.

ఆంధ్ర దేశపుటన్ని మూలలనుంచీ ధారాపాతంగా వచ్చిన సరుకులతో, గాదెలూ, కందా కొట్లూ కూడా నిండాయి. కాంగ్రెసు అయిపోయినా అవి పూటుగానే ఉన్నాయి. అందువలన కాంగ్రెసుకు వచ్చిన ప్రతినిధులూ, ప్రేక్షకులూ కూడా జరిగిన, జరుగుతూన్న ఏర్పాట్లకు విస్తుపోయారు. వచ్చిన వారి కందరికీ అనుకున్న దానికంటె ఎన్నోరెట్లు అధికంగానే ఆదరణ లభించింది. ఆయన చేసిన ప్రతి కార్యం అమోఘంగానే నిర్వహింపబడింది. సాంబమూర్తిగారు తమ నేర్పుతో ఆంధ్ర దేశీయుల నందరినీ ఒక "కామధేనువు"గా మార్చగలిగారు.

ఆయన ఇట్టి ఏర్పాట్లన్నీ పుట్టెడు దు:ఖంతో ఉండి కూడా చేయగలిగాడు. ఆయన ఏకైక పుత్రుడు, కాంగ్రెసు కొద్ది రోజులలో ఆరంభం అయ్యే ముందర, కన్నుమూశాడు. ఆయన ఆశలన్నీ ఆ యిరవై సంవత్సరాల యువకుని పైనే కేంద్రీకరింపబడి ఉన్నా, ఆ విచారాన్నంతటినీ దిగమ్రింగి, ఉత్సాహం తెచ్చుకుని అన్ని ప్రాంతాలూ తిరిగి, కాంగ్రెసుకు అవసరమైన రంగాలన్నింటికీ కావలసిన సహాయం పుట్టించ గలిగాడు. సాంబమూర్తిగారి తండ్రి సుబ్బావధానిగారు. ఆయన ఆంధ్రావనిలో పేరుపడ్డ మహాపండితుడు, మంచిజ్ఞాని, వేదాంతి. ఆయన, వృద్ధాప్యంలో మరణ శయ్యమీద ఉండగా, కాకినాడలో వారి స్వగృహంలో దర్శించుకోగల భాగ్యం నాకులభించింది. సాంబమూర్తి ఆ తండ్రికి తగిన బిడ్డే. అందువల్లనే ఏకైక పుత్రుని మరణంతో కృంగి పోకుండా, శోకభారాన్ని హృదయంలోనే ఇముడ్చుకుని, కార్యరంగంలో ప్రవేశించి సాధించుకు రాగలిగారు. "జాతస్య మరణం ధ్రువం" అన్న నుడే ఆయనికి శాంతినీ, శక్తినీ ఇచ్చియుంటుంది.