పుట:Naajeevitayatrat021599mbp.pdf/274

ఈ పుట ఆమోదించబడ్డది

ఒక్కటిమాత్రం నిజం. 1923 లో జనం అంతగా బాధపడడానికి కారణం, ఆనాటి ప్రభుత్వం, జాతీయమైన ప్రజాప్రభుత్వం కాక పోవడమేనని నొక్కి వక్కాణించగలను, అందువల్లనే, అవకాశం చిక్కి రాజ్యాంగాన్ని కాంగ్రెసు పేరిట 1937-38 లో స్వీకరించ గలిగిన సందర్భంలో, కరువులూ, వరదలూ, తుపానులూ లాంటివి నా పోర్టుపోలియోలోకి తీసుకుని, అవసరం అయినప్పుడల్లా బాధితులకు కావలసిన సహాయం అవిచ్చిన్నంగా చేయగలిగాను. అంతేకాదు-అవసరాలకు ఆర్థిక శాఖవారు ధానాన్ని మంజూరుచేసి యిచ్చేలోపలే నేను ఆయాప్రాంతాలకు వెళ్ళి ప్రజల సహాయ్య సహకారాలతో, శక్తివంచన లేకుండా చేయగలిగిన సేవ చేస్తూండేవాడిని.

కాంగ్రెసుకు ఖాదీడేరా

నాటి వరదలూ, తుపానులూ కూడా కాకినాడ కాంగ్రెసుకు కావలసిన యేర్పాట్లు సవ్యంగా చేయడానికి వీలులేకుండా చికాకులూ, ఇబ్బందులూ కలుగ జేశాయి. కాంగ్రెసుకు అవసరం అయ్యే ఖర్చుల కోసం, కాంగ్రెసువారు ధనాన్ని సేకరించడంలో నిమగ్నులయ్యారు. ఈ కారణం వల్ల కూడా వరద బాధితుల సాహాయ్యానికి కావలసినంత జోరుగా ధనాదులను సంపాదించలేక పోయాము. కాని ఆంధ్ర ప్రజానీకంలో వెనకాడే గుణం లేకపోవడాన్ని, వారికున్న ఆర్థికపు టిబ్బందులను విస్మరించి, వలసిన ఆర్థిక సహాయాన్ని ఆనందంగా జేశారు.

ఇటు "రిలీప్" పనులూ, అటు కాంగ్రెసు కార్యకలాపాలూ చాలా విజయవంతమే అయ్యాయి. అంతేకాదు-కాంగ్రెసు అనంతరం కాంగ్రెసు ఎక్కడ జరిగినా వేసుకోవడానికి సువిశాలమయిన పెద్ద డేరా, ఆ డేరాకు కావలసిన హంగులూ శాశ్వతంగా సమకూర్చి సమర్పించ గలిగింది ఆంధ్ర దేశమే. ఆరోజులలో అ ఖాదీడేరా ఖరీదు లక్షా యాభై వేలపై చిలుకు ఉంటుందని అంచనా వేశారు. దురదృష్టవశాత్తూ, ఈ డేరా వగైరాలు, అయిదారు సంవత్సరాలు వాడుకున్నాక, అనుకోకుండా పరశురామ ప్రీతి అయ్యాయన్నది వేరే విషయం.