పుట:Naajeevitayatrat021599mbp.pdf/273

ఈ పుట ఆమోదించబడ్డది

11

చరిత్రాత్మకమైన కాకినాడ కాంగ్రెస్

1923 డిసెంబరులో కాకినాడలో కాంగ్రెసు జరుప దలచాము, దురదృష్టవశాత్తూ ఆ సంవత్సరం గోదావరినదిలో ముమ్మరంగా వరదలు రావడమూ, అక్కడి ప్రాంతాలన్నీ చాలా వరకూ తుపాను దెబ్బతినడమూ సంభవించింది. తిరిగీ 1937-38 లలో కూడా ఆంధ్రదేశపు పలు ప్రాంతాలూ అలాంటి ఇక్కట్లే ఎదుర్కోవలసి వచ్చింది. కాని అప్పటి పరిస్థితులు వేరు. ఆ సంవత్సరాలలో మేము రాజ్యాంగాన్ని కాంగ్రెసు పేరిట నిర్వహిస్తూన్న కారణంగా నేను రివెన్యూ మంత్రిగా ఉంటూ కరువులూ, వరదలూ మొదలైన అరిష్టాల వలన కలిగిన పరిస్థితులను కూడా సరిదిద్దవలసిన బాధ్యతను వహించాను.

వరద బాధితులకు సహాయ్యం

నిజానికి 1923 లో కాంగ్రెసు కమిటీవారు ఇవ్వగలిగిన సహాయం అత్యల్పం అయింది. కాని నేను ఆ ప్రాంతానికి వెళ్ళి ప్రజలచేయూతతో ఎంతో సహాయం చేయకలిగాను. జిల్లా అధికార్లూ డివిజన్ అధికార్లూ కూడా మాతో చేతులు కలిపి చేయగలిగినంత సహాయం చేయడానికి సంసిద్దు లయ్యారు. నేరుగా గవర్నమెంటు బొక్కసంలోంచి కాకపోయినా, అక్కడ ధనాన్ని విరివిగానే ఖర్చు పెట్టగలిగాము. జమీందార్లూ, భూస్వాములూ, సామాన్య ప్రజలూ కూడా తమ శక్తివంచన లేకుండా ఇచ్చిన ధన కనక వస్తు వాహన సంపత్తితో, నిలువనీడలేని వేలాది జనానికి లక్షలాది వెదుళ్ళూ, కోట్లాదిగా తాటాకులూ సప్లయి చేయ గలిగాము.

ఆనాడు మేము ఎంత సేవ చేయగలిగినా, 1937-38 సంవత్సరాలలో తుపాను బాధితులకు యివ్వగలిగిన సహాయంతో పోల్చిచూస్తే 1923 లో మేము చేసిన సహాయం అత్యల్పం అని ఒప్పుకోకతప్పదు.