పుట:Naajeevitayatrat021599mbp.pdf/271

ఈ పుట ఆమోదించబడ్డది

నాగపూరు నివాసి అయిన ఒక పెద్దమనిషి మేమంతా మధ్య రాష్ట్రాల సెంట్రల్ (ప్రావిన్సెస్) లోని ముఖ్య నగరాల నన్నింటినీ చుట్టి ప్రచారం చేయడానికి వలసిన యేర్పాట్లన్నీ చేయించాడు. అనుకున్న ప్రచారం అన్ని కేంద్రాలనూ చట్టిన ముఖ్యులలో నేనూ ఉన్నాను. వెళ్ళిన చోటల్లా మనుష్యులు కరువయిన కారణంగా ఉద్యమం కుంటుపడిందంటే అది మీ రాష్ట్రీయుల కందరికీ సిగ్గుచేటని నొక్కి వక్కాణించాను. చాలాదూరంలో ఉన్న మా ఆంధ్రదేశంనుంచి మీ గౌరవం కాపాడడానికి మా మనుష్యులు రానై ఉన్నారనీ చెప్పాను. మా దేశంనుంచి వచ్చేవారు రాకుండా రైళ్ళలో ఇబ్బందులు కలుగజేస్తే మా వాళ్ళు కష్ట నష్టాలకు ఓర్చి అంతదూరంనుంచీ నడిచి అయినా సరే వచ్చి మీ గౌరవాలు కాపాడుతారని చెప్పాను. మా నాగపూరు యాత్ర ప్రబోధాత్మకంగా విజయాన్ని సాధించిందనే చెప్పాలి.

కాని ప్రజలలో నిజమయిన ఉత్సాహాన్ని అనేక కారణాలవల్ల కలుగజేయలేక పోయాము. ఈ జెండా సత్యాగ్రహాన్ని అఖిల భారత సమస్యగా పరిగణించాలని 19-7-1923 న ప్రతిపాధించడమూ, దాన్తో దేశం నలుమాలల నుండీ జనం తండోపతండాలుగా రావడమూ జరిగేసరికి దేశంలో నూతనోత్సాహం, చైతన్యం, వగైరాలన్నీ కలిగాయి.

ఆంధ్రుల మందంజ

చెప్పిన పద్ధతిగా చేయడానికి మున్ముందుగా తయారయింది మేమే. మన ప్రాంతానికి మేము తిరిగి వచ్చిన వెనువెంటనే రాష్ట్రీయ కాంగ్రెసు సంఘ సమావేశాన్ని జరూరుగా ఏర్పాటుచేసి, అందులో ఈ నాగపూరు జెండా సత్యాగ్రహ పరిస్థితులను తర్జన భర్జన చేశాము. సభలో ఉద్రేక పూరితమయిన ఉపన్యాసాలు ఇవ్వబడ్డాయి. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారు, మన వాలంటీర్లని నాగపూరు పంపించిడానికి వీలులేదని ఘంటాపథంగా వక్కాణించాడు. కాని కమిటీవారు మన వాలంటీర్లను నాగపూరు పంపించాలనే నిర్ణయానికి వచ్చి, అత్యధికమైన మెజారిటీతో తీర్మానాన్ని నెగ్గించారు.