పుట:Naajeevitayatrat021599mbp.pdf/269

ఈ పుట ఆమోదించబడ్డది

వారు విచారగ్రస్తు లయ్యారు. దేశనాయకులలో చీలికలు బయలుదేరి, గాంధీగారి సహకార నిరాకరణ విధానం సాగించాలా వద్దా అన్న మీమాంసతోవారు తగవులాడుకుంటూ ఉంటే గమనించిన కాంగ్రెసు వారెవరయినా నిజంగా మానసిక వేదనకు లోనయారంటే ఆశ్చర్యంలేదు.

జమన్‌లాల్ బజాజ్‌లాంటి ఉత్తమ నాయకుల నాయకత్వంలో నడుస్తూన్న మధ్య పరగణాలలో ఉత్సాహం చచ్చిపోయిందంటె, నాకు నిజంగా చాలా బాధనిపించింది.

నాగపురంలో జెండా సత్యాగ్రహ విషయం గమనిద్దామని మేము నాగపూరు వెళ్ళేసరికే 81 మంది అరెస్టయ్యారు. బజాజ్‌లాంటి ఉత్తమ నాయకుడు అరెస్టయి శిక్షింపబడిన సందర్భంలో, అరెస్టుకు సిద్ధమయిన 82 వ వ్యక్తి లభింపలేదనే విషయం మమ్మల్ని ఆశ్చర్యచకితుల్ని చేసింది.

ఇలా అన్నానని మధ్య పరగణా మనుష్యులు ఇతర ప్రాంతీయులకంటె దేశభక్తిలోనూ, ఉత్సాహంలోనూ, తీసికట్టనిగాదు నా ఉద్దేశం. గత 20 సంవత్సరాలుగా నడుస్తూన్న స్వాతంత్ర్య సమరం సందర్భంలో వెనుకంజ వేసిన వారెవరూ లేరు. అన్నిప్రాంతాల భారతీయులలోనూ వున్నవి ఒకేరకపు రక్తమాంసాలే. వారి ఉత్సాహాతిశయాలలోనూ తేడాపాడాలు లేవు.

కాని దేశీయులలో ఆ ఉత్సాహం సన్నగిల్లినప్పుడు, క్లిష్ట పరిస్థితులలోనూ ప్రజలలో ఉత్సాహోద్రేకాలను రేకెత్తించగలవి నాయకుల ధైర్య స్థెర్యాలూ, వారి ఉద్బోధనా పద్ధతులూ మాత్రమే. సరిఅయిన నాయకులు ముందడుగువేసి జనులలో ఉత్సాహాన్ని రేకెత్తించవలసి ఉంది. నాగపూరులో అఖిల భారత కాంగ్రెసు కమిటీ మీటింగులకు హాజరయి, పరిస్థితులను గమనించిన మా కందరికీ ఒకటే అనిపించింది. ఈ నిరుత్సాహానికి కారణం నాయకులమధ్య ఏర్పడిన అభిప్రాయ భేదాలూ, కుమ్ములాటివే అని.