ఈ పుట ఆమోదించబడ్డది

పూర్వగాధ

సమయాల్లో పొలాలకికూడా వెళ్ళి వ్యవసాయపు పనిపాటల్లో పాల్గొనేవారు. ముఖ్యంగా దూడలకి గడ్డి సేకరించడం వాళ్ళ అభిమాన విషయం.

మా రెండో మేనత్తగారైన నరసమ్మ గారికి అప్పట్లో అద్దంకి పరగణా ఉత్తరఖండంలో చేరిన కొరెసపాడు గ్రామంలో వివాహం చేశారు. ఆవిడికి నరసింహం, నారయ్య అని ఇద్దరు కుమాళ్ళు.

మా తండ్రి గారు సుమారు 30 వ ఏట కనపర్తి గ్రామం వారు వినోదరాయుడుపాలెలలో కనపర్తి కామాక్షమ్మగారి ఏకైక పుత్రిక సుబ్బమ్మ గారిని వివాహం చేసుకున్నారు. ఆమెవల్ల ఆయనకి సంతానం ఆరుగురు. అందులో మొదటి ఇద్దరూ ఆడవాళ్ళు. మూడో సంతానం నేను. నా తరవాత శ్రీరాములు. అతని తరువాత అన్నపూర్ణ అనే ఆడపిల్ల. ఆమె సుమారు 13 సంవత్సరాలు జీవించి, వివాహం అయిన తరువాత చనిపోయింది. ఆమె తరరువాత మా నాయనగారు చనిపోయిన రెండు మాసాలకి జానకిరామయ్య జన్మించాడు. ఈ సందర్భంలో మా తండ్రిగారి జీవితాన్ని గురించీ, నేను స్వయంగా ఎరిగినంతవరకు ఆ కాలంలో ఉండే జీవిత వ్యవహారాలని గురించి కొంచెం వ్రాస్తాను.

మా తల్లిదండ్రుల్లో మొదటి ఆయన రాఘవయ్యగారు తిరుపతి వెళ్ళిపోయినట్లు లోగడ వ్రాశాను. తరవాత కొంతకాలానికి మిగిలిన వారు వల్లూరులో ఉన్న ఇల్లూ, భూములు పంచుకుని కాలక్షేపం చేశారు. క్రమంగా మా తండ్రులందరికీ కుటుంబాలు పెరిగిపోయి, భూమిమీద వచ్చే ఆదాయాలతో జీవనం చెయ్యడం సాధ్యంకాని రోజులు వచ్చాయి. నా పుట్టుకకి పూర్వమే అల్లాంటి నిక్కచ్చి కనిపించింది. మా తండ్రిగారు, ఆ ఆదాయంతోనే నా అక్కగార్లిద్దరికీ వివాహాలు చేశారు. వారిద్దరినీ మంచి సాంప్రదాయమూ, భూవసతి కలిగిన కుటుంబాలలో ఇచ్చి వివాహం చేశారు.

ఆ కాలంలో వాళ్ళ జీవితాలు మంచి హుందాగానూ, గంభీరం గానూ, నిగ్రహంతోనూ గడిచిపోయేవి. కుటుంబాల్లో అన్యోన్యప్రేమాతిశయాలు చాలా ఎక్కువగా ఉండేవి. ఆస్తిపాస్తులలో వ్యష్టిగా ఉన్నా, ప్రేమానుబంధాల్లో సమష్టి భావమూ, ఏకతా ప్రతి నిమిషమూ కన