పుట:Naajeevitayatrat021599mbp.pdf/237

ఈ పుట ఆమోదించబడ్డది

క్రింది కోర్టులో సుబ్బరామయ్యగారు మా దర్యాప్తూ, వ్రాసిన రిపోర్టూ అంగీకరించివున్న కారణంచేత, క్రింది కోర్టు తీర్పుమీద అపీలు చేయడానికి సావకాశం లేనందువల్ల, రామచంద్రయ్యరు ఒక క్రొత్త ఎత్తు ఎత్తాడు. "విచారించాము, రిపోర్టు వ్రాశాము" అన్నంత మాత్రాన మాక్లయింటు దోషికాడు. ఆయన ఆ రిపోర్టు మీద సంతకం చేశాడా, లేదా అన్నదే ముఖ్యం అంటూ వాదన లేవదీశాడు. అంటే సుబ్బరామయ్యగారు పెట్టకపోయినా, అనుమతించకపోయినా, వారికి తెలియకుండా, వారి సంతకం నేను పోర్జరీ చేశానన్నమాట! ఆ వాదన సారాంశం అంతేగా? కేసు విచారణ జరిగిన క్రింది కోర్టులో యీవాదన రాలేదు. మొట్టమొదటిసారిగా యీ వాదన అపీలు కోర్టులోనే వచ్చిన కారణంగా, ఈ పాయింటును మేము చర్చించము అని ఖండితముగా హైకోర్టువారు చెప్పడం న్యాయం. ఈ అప్పీలు ఇరువురు జడ్జీల సమక్షంలో విచారణ కావాలని కోరివుండిన కారణంగా, ఇది ఇద్దరు జడ్జీల ముందుకు వచ్చింది. ఆ ఇద్దరు జడ్జీలలోనూ ఒకరు రామేశంగారు. ఆ రిపోర్టులో తన క్లయింటు ఎప్పుడూ సంతకం పెట్టి యుండ లేదంటూ వ్రాసిన అఫిడవిట్టును టి.ఆర్.రామచంద్రయ్యరు దాఖలు చేయడానికి ఇరువురు జడ్జీలూ అంగీకరించారు. ఈ అఫిడవిట్టు కోర్టులో చదివబడిన సందర్భంలో కోర్టులో విచారణకుగాను కూర్చున్న రామేశంగారు, తన జడ్జీ స్థానంనుంచే, అప్పటి వరకూ ఈ సహాయ నిరాకరణ ఉధ్యమ నాయకులమీద తనకు మంచి విశ్వాసం ఉండేదనిన్ని, ఈ అఫిడవిట్టు విన్నాక కాంగ్రెసు నాయకులపై తనకు ఏర్పడిన సదభిప్రాయం మార్చుకోవలసి వస్తోందనీ అన్నాడు.

సాగుతూ ఉన్న కోర్టు విచారణ ఎప్పటి కప్పుడు అన్ని పేపర్లలోనూ రిపోర్టయ్యేది. దీన్తో నా పరిస్థితి చాలా ఇరుకున పడిపోయింది. బ్రిటిషువారి కోర్టులలో ఎంతమాత్రమూ నమ్మకము లేదని అంటూ, క్రిందికోర్టులో నేను హాజరుకాని కారణంగా, ఇప్పుడు నేను హైకోర్టులో