పుట:Naajeevitayatrat021599mbp.pdf/226

ఈ పుట ఆమోదించబడ్డది

విరమించినవారే, ఆయన వేలాది జనులముందు నిలబడి ఉపన్యసిస్తూన్న సమయంలో, వరుమానాలూ, ఖర్చులూ, ఆర్ధిక అవసరాలు మున్నగు విషయాల ప్రసక్తి వస్తే, కాగితాలతోటీ, కలాలతోటీ నిమిత్తం లేకుండానే పెద్ద పెద్ద ఆర్థిక వేత్తలను మించి మాట్లాడగలశక్తి ఆయనకుంది. వారూ, వెంకటప్పయ్య పంతులుగారూ కలసి దేశస్వాతంత్ర్యానికి అవసరమయిన యే త్యాగానికయినా సంసిద్దు లయ్యారు.

గాంధీగారూ, సర్దార్ వల్లబాయ్ పటేలుగారూ బార్డోలీలోనే పన్నుల నిరాకరణ ఉద్యమం ప్రారంభించాలని నిశ్చయించుకున్న సందర్భంలో సీతారామశాస్త్రిగారూ, వెంకటప్పయ్య పంతులుగారూ కలిసి అట్టి పన్నుల నిరాకరణ గుంటూరులోనే గాక, ఆంధ్రరాష్ట్రపు టన్ని జిల్లాలలోనూ ఆరంభించడానికి కుతూహలం చూపించారు.కాని వారి ఉత్సాహంలో, అటువంటి ఉద్యమాన్ని అణగద్రొక్కడానికి ప్రభుత్వం తీసుకునే తీవ్ర చర్యలకు కృషీవలు లందరూ తట్టుకుని నిలబడగలరా అన్న విషయాన్ని బాగుగా ఆలోచించి ఉండిఉండరు. పన్నుల నిరాకరణ ఉధ్యమపు పర్యవసానాలన్నీ క్షుణ్ణంగా ఎరిగివున్న మహాత్ముడుమాత్రం, తమశక్తినీ బలాన్నీ పూర్తిగా అవగాహన చేసుకోకుండా ఉద్యమంలోనికి దిగవద్దని హెచ్చరిస్తూ, ప్రజలలో ఉండే విశ్వాసాన్నీ శక్తినీ కూడా గమనించవలసిందని ఆదేశించారు.

పెదనందిపాడులో మిలిటరీ మార్చ్

అప్పట్లో నేనూ కార్యనిర్వాహక వర్గ సభ్యుడనే అయి ఉన్నా నాతోకూడా సంప్రతించకుండా, వా రుభయులూ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇట్టి పరిస్థితులలో ఆరంభమయిన ఉద్యమం విద్యుత్‌వేగంతో జిల్లా అంతటా ప్రాకిపోయింది. ఉన్నవ లక్ష్మీనారాయణగారు పల్నాడు ప్రాంతపు అటవికశాఖ పన్నుల నిరాకరణ ఉద్యమంగా తమ స్వంత పర్యవేక్షణ క్రింద ప్రారంభించారు. రైతులందరూ ఈ పన్నుల నిరాకరణ ఉద్యమానికి శతవిధాల స్వాగతం చెప్పారు. స్వరాజ్యం వచ్చేస్తోంది, పన్నులు చెల్లించకుండానే హాయిగా మనం జీవించగలం అనే వా రూహించారు. రివెన్యూ అధికారులు ప్రజల వద్దనుంచీ, రైతుల వద్దనుంచీ