పుట:Naajeevitayatrat021599mbp.pdf/211

ఈ పుట ఆమోదించబడ్డది

కారణంగా పరిపాలకుల హృదయాలలో రేగిన కలకలమూ, త్రివిధ బహిష్కరణ ఉద్యమం సాధించిన జయ పరంపరలూ కాస్త గమనిద్దాం.

ఆంధ్రదేశం మొత్తంమీద అనేక ప్రాంతాలలో దేశీయ విద్యాలయాలూ, ఖాదీ ఉత్పత్తిస్థావరాలూ, పంచాయతీ కోర్టులూ స్థాపింప బడ్డాయన్న విషయం చదువరుల దృష్టికి యిదివరలోనే తీసుకువచ్చాను. భారతదేశం మొత్తంమీద ఖాదీఉద్యమం భారీఎత్తున సాగించిన రాష్ట్రాలలో ఆంధ్రరాష్ట్రానిదే అగ్రతాంబూలం. అంధ్రదేశంలో అన్ని ప్రాంతాలలోనూ వందలాది స్త్రీలు ఖద్దరు చీరెలలోనే కనబడేవారు. ఏ విధమయిన ప్రోద్బలమూ చరఖాసంఘ సహకారమూ లేకుండానే, తమతమ స్వంత భాధ్యతలపైనే ఖాదీ కార్యక్రమాన్ని కొనసాగించిన నా అనుచరులే నాకు అనేకవిధాల గర్వకారణమయ్యారు. జిల్లాలవారీగ అనేక ప్రాంతాలలో ప్రాక్టీసు విరమించి ఉద్యమంలో జేరిన లాయర్లందరూ చాలవరకూ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాలలోకంటె ఎంతో యెక్కువగా ఆంధ్ర వనితలు ఈ ఉద్యమంలో పాల్గొన్నారని వేరే చెప్పనక్కరలేదు. రాష్ట్రం మొత్తంమీద కాలేజీలనూ, ఇతర విద్యాలయాలనూ బహిష్కరించిన విద్యార్థులంతా కాంగ్రెసు కార్యక్రమాలలో పాల్గొన్నారు. కో అంటే కోటిమంది అన్న సామ్యంగా యువక వాలంటీర్లకు ఎప్పుడూ కొరవలేదు.

కాంగ్రెసుకున్న నిధులా అతి స్వల్పం. ఉన్న నిధులలో దేశవ్యాప్తంగా ఉద్యమం నడవడం వట్టిది, మహానడుస్తే మూనాళ్ళ పట్టపగలు: అని కాంగ్రెసేతరులూ, ప్రభుత్వంవారూ అనుకుంటూ వచ్చారు. అట్టి పరిస్థితులలో కాంగ్రెసు కమిటీవారి నుంచి సహకారమూ, చరఖా సంఘంనుంచి ధనమూ లేకపోయినా దేశవ్యాప్తంగా యీ ఉద్యమం యిల్లా కొనసాగడం ప్రభుత్వంవారినీ, కాంగ్రెసు వ్యతిరిక్తులనూ కూడా ఆశ్చర్యసాగరంలో ముంచేసింది.

అవతారపురుషు డనిపించిన గాంధీ

గాంధీగారికి, కాంగ్రెసుకూ ఏర్పడిన అవినాభవ సంబంధంతో