ఈ పుట ఆమోదించబడ్డది

xviii

సంక్రమించే సహజదర్పము, ప్రథమములో సౌఖ్యము, అనంతరము అర్థనాశము, అధిక కష్టములు, ఆత్మోద్ధరణ వాంఛ - ఇవి అన్నీ కదంబ ప్రాయము అయి పంతులు అద్భుత వ్యక్తి అయినాడు. దు:ఖాభి భూతుడు కానివాడు ధీరుడు కాలేడు. ఆదినుంచి నేటివరకు ఆంధ్ర కేసరికి వివిధ వ్యథలు కలుగుచునే ఉన్నవి. అందుచేతనే అంతటి ద్రఢిమ ఏర్పడి అంతరాయములలో ఆయన ప్రముఖుడే కాని, పరాఙ్ముఖుడు కావడము లేదు.

మొన్న మొన్నటి వరకు ఆంధ్రుడికి సంపన్న న్యాయవాదే గణ్యుడు. అందుచేతనే ఆనాడు పంతులు న్యాయవాద వృత్తిమీద మనసుపోయి మదరాసు లా కాలేజీలో చదవడమూ, రాజమహేంద్రవరములో వకీలుగా ఉండడమూ సంభవించినది. ఊర్ద్వదృష్టి ఉన్నవాడు ఊరుకో లేడు. ఆయన ఉత్త ప్లీడరుగా ఉండక న్యాయ విద్యలో ప్రశస్తమైన బారిష్టరు పట్టము తెచ్చుకొని రాజధానికే పోయి నిరుత్సాహ చ్ఛాయ దగ్గరకు రానీయక ధైర్యముతో అడ్డంకులను అన్నిటినీ ప్రతిఘటించి అన్ని విధముల ప్రాభవము పొందినాడు. సడలని పట్టుదల వల్లనే జయము సమకూరుతున్నది.

అభిమానవంతుడు, ఆత్మోద్ధర ణాభిలాషి, అన్య జన లక్ష్యము లేనివాడు. అగ్రగణ్యుడు అయినప్పటికీ ప్రకాశ ప్రధాని బాల్యములో పడిన అవమానములు, అనుభవించిన కష్టములు, చేసిన చిలిపి పనులు, శృంగార చేష్టలు దాచిపెట్టకుండా నిజముగా ఉద్ఘాటించి నాడు. సహజముగా స్వచ్ఛ బుద్ధి కలవారు, ధైర్యస్థైర్యములు ఉన్నవారూ ఉన్నది ఉన్నట్టుగా సత్యము చెప్పగలరు. పంతులు ప్రకటము చేసిన విషయములు ఆయనమీద ఆదరము కలిగించడమే కాక, అన్యులకు ఆదర్శము కూడా అవుతవి. కృతజ్ఞతా మాధుర్యము "జీవిత యాత్ర"లో చాలా తావుల వెల్లివిరిసింది. ప్రత్యుపకార పరిమళము బహుస్థానాలలో వాసించినది.