పుట:Naajeevitayatrat021599mbp.pdf/178

ఈ పుట ఆమోదించబడ్డది

వర్తకులు చాలామంది చెన్న నగరానికి వచ్చి, ఇక్కడనే వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు. అందుచేత చెన్ననగరం ఆంధ్రనగరం అని చెప్పడానికి ఎల్లాంటి సందేహమూ లేదు. ఆ కారణం చేతనే చెన్న నగరంలో ఏర్పడిన కాంగ్రెసు కూడా ఆంధ్ర రాష్ట్రంలో చేర్చబడింది. 1921 వ సంవత్సరంలో నాగపూరు కాంగ్రెసులో దేశమంతా 21 రాష్ట్రాలకింద విభజన కాక పూర్వం చెన్న నగరం ప్రత్యేకంగా తమిళులది అని కాని, తెలుగువారిది అనికాని, మళయాళపువారిది అని కాని, కన్నడపువారిది అనికాని చెప్పడానికీ, అనుకోవడానికీ కూడా అవకాశం లేకుండా ఉండేది. ఇది ఇంగ్లీషువారి చేతుల్లోకి రాకపూర్వం చెన్ననగరపు చరిత్ర. ఇది ఇల్లాంటిది అని ఎవరూ అనుకోకుండానే అరవలు, తెలుగువారు, మళయాళపువారు, గుజరాతీలు అందరూ కూడా ఇక్కడ ప్రవేశించి వర్తకం చేస్తూ ఉద్యోగాలు సంపాదించుకుని, ఇంకా ఇతరమైన వృత్తులుకూడా చేసుకుంటూ ఉండేవారు. మద్రాసులో హైకోర్టు ఉండడంవల్ల లాయర్లు అన్ని భాషా రాష్ట్రాలనించీ ఇక్కడికి వచ్చి, ప్రాక్టీసు చేసుకుంటూ ఉండేవారు, నా చిన్నతనంలోనే మద్రాసు లా కాలేజీలో చదవడమూ, ప్లీడరీ పరీక్ష పాసుకావడమూ, తరవాత రాజమహేంద్రవరంలో ప్రాక్టీసు చెయ్యడమూ మొదలయిన వాటినిగురించి ఇదివరకే వ్రాశాను. 9, 10 సంవత్సరాలు రాజమహేంద్రవరంలో ప్రాక్టీసు చేసిన తరవాత 1903 వ సంవత్సరం అక్టోబరునెలలో ఇంగ్లండు వెళ్ళడమూ, అక్కడ బారిష్టరు పాసైన తరవాత 1909 వ సంవత్సరం ఆఖరులో మద్రాసు హైకోర్టులో ప్రాక్టీసు ప్రారంభించిడమూ, 14, 15 సంవత్సరాలు ప్రాక్టీసు చేసిన తరవాత 1921 వ సంవత్సరంలో కాంగ్రెసు ఉత్తరువు ప్రకారం న్యాయవాదవృత్తి వదలి వేయడమూ కూడా ఇదివరకే వ్రాశాను. స్వరాజ్య పత్రిక ప్రారంభించక పూర్వం మద్రాసులో నేను ఎంతకాలంనించి ఉన్నాను అనే విషయాలు చెప్పడానికి ఇవి మళ్ళీ వ్రాశాను. 1917 వ సంవత్సరం మొదలుకుని 1921 వ సంవత్సరంలో బారిష్టరు వృత్తి విడిచిపెట్టేవరకూ, హైకోర్టు