పుట:Naajeevitayatrat021599mbp.pdf/172

ఈ పుట ఆమోదించబడ్డది

లీగులో చేరాను. ఆరోజుల్లో గోఖలేహాలులో జరిగే సభలకి హాజరౌ పాల్గొంటూ ఉండేవాణ్ణి.

1917 వ సంవత్సరంలో రాజకీయాందోళన మరింత తీవ్రం అయింది. ముఖ్యంగా బిసెంటు న్యూ ఇండియా పత్రిక ద్వారా మద్రాసురాష్ట్రంలో ఆందోళన మరింత తీవ్రరూపం ధరించింది. యీ ఆందోళన పర్యవసానంగా దేశంలో అంతటా నిర్భంధ విధానం తాండవించింది. చివరికి, బిసెంటమ్మ ముఖ్యశిష్యులైన అరండేలు, వాడియా గార్లని 1917 జూన్ 15 తేదీని ఉదకమండలంలోనూ, కోయంబత్తూరులోనూ నిర్భందించారు. రాజకీయాందోళనకి ఎప్పుడూ నిర్భంధ విధానమే గొప్ప సహాయకారి, మహత్తరమైన దోహదం! అదుచేత ఈ నిర్భంధాలు మరింత ఆందోళనకీ, సంచలనాలకీ కారణం అయ్యాయి. మళ్ళీ రాజకీయరంగంలో కొత్త కొత్త తారలు కనిపించాయి. నా మిత్రుడు పి. పి. రామస్వామయ్యరు ఆ వర్గంలోవాడు. బిసెంటమ్మ రాకతో ఆయనకూడా కాంగ్రెస్‌లో ప్రముఖస్థానం ఆక్రమించాడు.

ఆమె ఆందోళనసందర్భంలోనే సాత్విక నిరోధం అనే సాధనంతో ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ఎదుర్కొనాలి అనే భావం ప్రచారం అయింది. మద్రాసు రాష్ట్ర కాంగ్రెసు సంఘంవారు సాత్వికనిరోధ కార్యక్రమం ఆమోదించి ఒక ప్రమాణంమీద దస్కత్తులు చేయించారు. ఆ ప్రమాణాలమీద దస్కత్తులు చేసినవాళ్ళలో సర్ యస్. సుబ్రహ్మణ్యయ్యరుగారు, పి. పి. రామ స్వామయ్యరు గారు, కస్తూరి రంగయ్యగారు మొదలైన ప్రముఖులు చాలామంది ఉన్నారు. కాని, నాకు మాత్రం ఎందుచేతనో ఆ కార్యక్రమం జరుగుతుందనే నమ్మకం కలగలేదు. ఆ ప్రమాణపత్రంమీద నేను దస్కతు చెయ్యలేదు. తరవాత 1916 లో గాంధీజీ సత్యాగ్రహ ప్రమాణాలు చేయించి నప్పుడు దస్కతుపెట్టాను. నాకు బిసెంటు ఆధ్వర్యంకింద జరిగిన వ్యవహారంలో పని జరిగే ధోరణి కనిపించలేదు.