పుట:Naajeevitayatrat021599mbp.pdf/169

ఈ పుట ఆమోదించబడ్డది

మాటలు అక్షరాలా నిజం అయ్యాయి. దేశం ప్రేమించిన మహాత్యాగికి విధించన ఆరు సంవత్సరాల శిక్ష, ఎవరి హృదయాన్ని ఆందోళన పరచదు! ఇలాంటి స్థితిగతుల్లో అంతకు ముందు సాంఘిక మత విషయాల్లో మాత్రమే పనిచేస్తూ, దివ్యజ్ఞాన సమాజానికి అధ్యక్షురాలై ఉన్న బిసెంటమ్మకూడా రాజకీయ రంగంలోకి ఉరికింది. అంతవరకూ ఆమె మత సంబంధమైన గొడవల్లోనే మునిగి ఉండేది. ఆమెకు సహజంగా ఉండిన వాగ్ధోరణీ, నిర్మాణపు నైపుణ్యమూ, రాళ్ళని సహితం చలింపజేసి ఉత్తేజం కలగచేసే శక్తీ రాజకీయ రంగంలో ప్రవేశించాయి. దాంతో మద్రాసులోనే కాకుండా దేశమంతటా కొంత సంచలనం ప్రారంభం అయింది. ఆమె 'న్యూ ఇండియా' అనే పేరుతో దైనిక, వారపత్రికలు నడిపిస్తూ వాటిల్లో చాలా ఉత్తేజకరా లయిన వ్యాసాలు వ్రాసేది.

లోకమాన్యుడు జైలునుంచి తిరిగి రాగానే భవిష్యత్కార్య క్రమాన్ని గురించి యోచించి దేశంలో తీవ్రమైన రాజకీయాందోళనం సాగించడానికి ఒక రాజకీయ సంస్థ నిర్మించాడు. అదే హోంరూలు లీగు. తరవాత కొంతకాలానికి మద్రాసులో బిసెంటమ్మ గోఖలే హాలులో ఒక సమావేశం ఏర్పాటుచేసి, అక్కడ అఖిల భారత హోంరూలు లీగు స్థాపించింది. బిసెంటమ్మకి శక్తి సామర్థ్యాలతోపాటు అధికారం చలాయించే అలవాటు కూడా ఎక్కువ. అందుచేత ఆమె ఒక పట్టున ఇతర నాయకుల వెనక ఉండిగాని, కలిసిగాని పని చెయ్యలేక పోయేది. ఏమైనా, ఈ అఖిల భారత హోంరూలు లీగు స్థాపనవల్ల రాజకీయంగా ఒక గొప్ప చైతన్యం కలిగింది. హైకోర్టు జడ్జీపని చేసి పింఛన్ పుచ్చుకున్న సర్ సుబ్రహ్మణ్యయ్యరు ప్రభృతులు ఈ సంస్థలో చేరారు. దేశంలో ఉన్న దివ్యజ్ఞాన సమాజాలు అన్నీ రాజకీయాల్లో ప్రవేశించాయి. దాంతో తీవ్రమైన జాతీయవాదం విజృంభించింది. ఇంక మితవాదులకి పట్టుగొమ్మ అయిన గోఖలే మహాశయుడు అ సంవత్స