పుట:Naajeevitayatrat021599mbp.pdf/149

ఈ పుట ఆమోదించబడ్డది

అతనికి పత్రికా రచన అంటే ఇష్టం. అప్పుడే 'కార్లీ లియను' అనే పత్రిక ఒకటి నడిపించేవాడు. ఆ కార్లీలియను పత్రికలో భయం అనేది లేకుండా మంచి జోరుగా వ్రాసేవాడు. ఆ పత్రిక అప్పటి ప్రజా జీవితంలో ఉండే వాళ్ళకి గుండె బెదురుగా ఉండేది. అతను తెలుగులో వివేకవర్దని, ఇంగ్లీషులో కార్లీ లియను నడిపేవాడు. నేను మద్రాసులో ప్రాక్టీసు పెట్టిన 5, 6 సంవత్సరాలకి కాబోలు, ఒక పెద్ద కేసులో ఇరుక్కున్నాడు.

19

వీరేశలింగం పంతులు కేసు

వీరేశలింగంగారికి మంగమ్మచేసే శుశ్రూష అనేకమైన అపార్థాలకి తావు ఇచ్చి, కొంత అపవాదుకి కారణం అయింది. ఆ విషయాన్ని గురించి తీవ్రంగా వ్రాయడంచేత వీరేశలింగంగారు శ్రీరాములుమీద జాయంటు మేజస్ట్రీటుకోర్టులో లైబెల్‌కేసు వేశారు. అప్పుడు నేను ప్రీవీ కౌన్సిలు పనిమీద లండను వెళ్ళాను. నేను తిరిగి వచ్చేసరికి ఈ కేసు సగం పూర్తి అయింది. అందరూ కూడా శ్రీరాములు జైలుకి వెళ్ళడం తప్పదని అనుకున్నారు. ఈలాంటి స్థితిలో కీర్తిశేషులైన చిత్రపు వెంకటాచలంగారు నాతో, "ప్రకాశం! నువ్వు సరియైన టైములో వచ్చావు. ఈ కేసు స్వయంగా చూడు. శ్రీరాముల్ని జైలుకి పంపడానికి అంతా సిద్దమై ఉంది. ఈ ప్రోసిక్యూషనులో పెద్దవాళ్ళు తెరవెనక నాటకం చాలా ఉంది," అని చెప్పారు. అప్పుడే ఆ కేసు విచారిస్తూ ఉన్న జాయింటు మేజస్ట్రీటు ట్రాన్సుఫరు అయి యఫ్. డబ్లియు. స్టూ అర్టు జాయింటు మేజస్ట్రీటుగా వచ్చాడు. మేజస్ట్రీటు మారడంచేత విచారణ మొదటినించీ జరగాలని వాదించాను. నా వాదన నెగ్గింది. స్టూ అర్టు నాతోటే లండన్‌లో ఓడ ఎక్కి ఇండియా వచ్చాడు. ఓడలో