పుట:Naajeevitayatrat021599mbp.pdf/147

ఈ పుట ఆమోదించబడ్డది

నించి వచ్చిన కొద్ది కాలానికే నా భార్య గర్భవతి అయింది. అప్పటి వరకూ జీవించి ఉన్న మా అమ్మగారు ఆ వార్తకి చాలా సంతోషించింది. ఆవిడకి లోకంతోపాటే మనమల్ని ఎత్తుకోవాలని ఆశ. కాని ఆ సంతోషానికి ఆవిడ నోచుకోలేదు. కొండిచెట్టి వీథిలో ఉండగానే ఆమె పక్షవాతంవల్ల మరణించింది. అప్పటికి ఆమె వయస్సు 60.

చనిపోయేటప్పుడు ఆమె నన్ను పిలిచి తను చిరకాలం కిందటనించీ జాగ్రత్తగా దాచి ఉంచుకున్న 800 రూపాయలమూటా నాకు అప్పగించింది. ఆమె అతిప్రయాసం మీద నన్ను, నా తమ్ముల్ని వృద్ధిలోకి తీసుకురావడమే కాకుండా ఈ రీతిగా ధనం సేకరించి నాకు అప్పచెప్పడం చాలా ఆశ్చర్యకరమయిన విషయం! ఆమె పడ్డ శ్రమకి ఆమె ఋణం తీర్చుకుందాం అంటే ఆఖరికి అంత్యక్రియలలోనైనా ఆ అవకాశం లభించింది కాదు. ఆమె ధన్యాత్మురాలు.

తరవాత మేము కొండిచెట్టి వీథినించి శుంకురామచెట్టి వీథిలోని జి. ఏ. నటేశను ఇంటిలోకి మారాము. అప్పుడే నాకు ప్రథమ పురుష సంతానం కలిగింది. కాని ప్రసవ సమయంలో ఫోర్‌సెఫ్స్ ఉపయోగించ వలసివచ్చింది. ఆ ఉపయోగించడంలో జరిగిన ప్రమాదంవల్ల ఆ కుర్రవాడు రెండు సంవత్సరాలు జీవించి చనిపోయాడు. మళ్ళీ రెండోసారి ప్రసవ సమయానికి నేను శాంతోమ్‌లోని సీవ్యూ అనే భవనం ఒకటి అద్దెకి తీసుకుని అందులోకి మారాను. మళ్ళీ నాకు మగపిల్లవాడు కలిగాడు. మరి ఒకటిన్నర సంవత్సరాలకి రెండో కుమారుడు జన్మించాడు. నేను అప్పటికే మదరాసులోని ఎల్లపదుమాడకోవెల వీథిలో ఉన్న ఇల్లు కొన్నాను. నెలకి నూరు రూపాయలు అద్దె యివ్వడంకన్న ఒక ఇల్లు ఉంటే మంచిదనే ఆలోచన కలిగింది. కాని నా దగ్గిర డబ్బు నిలవ ఉండే పద్ధతి లేదు. అప్పుడే నా మిత్రుడు కె. యస్. రామచంద్రరావు ఆరువేల రూపాయలు ఇచ్చి అ యిల్లు నాకోసం కొన్నాడు. అది సుమారు రెండున్నర ఎకరాల స్థలంలో ఉంది. ఆ ఇల్లు అంతా నేను తరవాత వృద్ధిచేసి కట్టినదే. ఆ తరవాత, చాలాకాలానికి నేను వడ్డీ