పుట:Naajeevitayatrat021599mbp.pdf/146

ఈ పుట ఆమోదించబడ్డది

స్థిరాస్తీ కూడా సంపాదించగలిగాను. నాకు విశ్రాంతి తీసుకున్న తరవాత మూడేసి మాసాలు ఒక్కొక్కచోట ఉండాలని ఒక ఆశ ఉండేది.

ఈ కాలంలోనే రెండు కేసులలో ప్రీవీకౌన్సిలు ఎదట వాదించడానికి రెండుసార్లు ఇంగ్లండు వెళ్ళి, అక్కడ ఒక్కొక్క సారి మూడుమాసాలకి తక్కువకాకుండా ఉన్నాను. యుద్దానికి పూర్వం వెస్టుమినిష్టరు పాలెస్ హోటలులో ఉండగా దక్షిణాఫ్రికా పోరాటం సాగిస్తూ ఉన్న బారిష్టరు మోహన్‌దాస్ కరంచందు గాంధీగారిని మొదట చూశాను. లండన్ ఇండియన్ సొసైటీ తరపున వెడ్డర్‌బర్న్ ప్రభృతులు ఈయన్ని ఆహ్వానించి, ఆ భవనంలోనే కింది అంతస్తులో ఒక పెద్ద విందు ఏర్పాటు చేశారు. చిరకాలంనించి ఆ సొసైటీతో నాకు సంబంధం ఉండడంచేత దానికి నేనూ హాజరు అయ్యాను. అపుడు గాంధీగారు పూర్తిగా పాశ్చాత్య దుస్తులు ధరించారు.

18

కుటుంబ స్థితిగతులు

నేను 1907 లో ఇంగ్లండునించి తిరిగి వచ్చి మద్రాసు చేరే సరికి, అప్పటి నా కుటుంబం స్థితి గతులూ, అనంతర పరిస్థితులూ కొంచెం వ్రాస్తాను. నాకు అప్పటికి సంతానం లేదు. నా కోసం ఎంతో శ్రమించిన మా అమ్మగారికి అది ఒక పెద్ద ఆదుర్దాకి కారణం అయింది. అప్పట్లో స్త్రీ చాపల్యంవల్ల నా సంసార జీవితంలో నాకు సౌఖ్యం లేదనే చెప్పవలసి ఉంటుంది. తత్పలితంగా నా భార్యకి అనారోగ్యం కలిగింది. ఆ రోజుల్లోనే నాకు తొట్టి వైద్యం అంటే బాగా గురి కుదిరింది. అందుచేత అప్పటికి ఆ వైద్యాన్ని గురించి కృషిచేసిన ద్రోణంరాజు వెంకట రమణారావుగారి దగ్గిర ఆ విషయమైన భోగట్టాలన్నీ తెలుసుకుని, నేనూ నా భార్యకూడా తొట్టి వైద్యం ప్రారంభించాము.

తరవాత ఇంగ్లండునించి తిరిగి వచ్చి మద్రాసులో కొండిచెట్టి వీథిలో ఉన్నప్పుడు కూడా ఆ వైద్యమే నమ్ముకున్నాను. నేను ఇంగ్లండు