పుట:Naajeevitayatrat021599mbp.pdf/143

ఈ పుట ఆమోదించబడ్డది

చదువుకుని, ఒక అభిప్రాయానికి వచ్చి, మాటిమాటికి అడ్డుతగుల్తూ ఉండేవాడు. లాయరు తన ఎదట పెట్టిన విషయాలన్నీ తన బుద్ధి విశేషంచేత వంకరటింకరగా తిప్పుతూ ఉండేవాడు. ఒక కేసులో నా కిల్లాంటి తగాదా వచ్చింది. అప్పుడు నేను లాటైమ్సుకి సంపాదకుడుగా ఉండేవాణ్ణి. అప్పుడు అ పత్రికలో, "This Judge is full of intellectual dishonesty," అని వ్రాశాను. దాని మీద జడ్జీలలో పెద్ద కలవరంపుట్టి, వీలైతే నా మీద జడ్జీల యెడల అగౌరవం చూపినందుకు కంటెంప్టుకేసు పెట్టాలని కూడా ఆలోచించారు. కాని, సందర్భాలను బట్టి Fair comment limit దాటక పోవడంవల్ల అది అంతటితో విరమించు కున్నారు. ఆలా టైమ్సుని గురించి ముందు ప్రత్యేకంగా వ్రాస్తాను.

ఇంతవరకూ నేను బారిష్టర్ల విషయమూ, జడ్జీల సంగతి వ్రాశాను. ఇక సివిలియన్ జడ్జీల సంగతి వ్రాస్తాను. ఈ జడ్జీలలో రెండు తరహాలవాళ్ళుండేవారు. ఈ జడ్జీలకి సమర్థత సామాన్యంగా ఉండేది. ఇందులో కొందరు జడ్జీలుగా కొంత అనుభవం సంపాదించి నిదానంగా ఉండేవారు. కొందరు, కాస్త చిరాకు తనం కలిగి, చెప్పినది సరిగా వినకుండా కిందకోర్టు తీర్పు ఖాయపరచే ధోరణిలో ఉండేవాళ్ళు, బెన్సన్ వగైరాలు ఈ తరహాకి చెందినవాళ్ళు. ఇందులోనూ కొందరు బెంచీ మీదనే చిరచిరలాడేవారు. కొందరు కేసవుతూంటే మాట్లాడకుండా కూర్చుని చివరికి కింది కోర్టులతో ఏకీభవిస్తూ ఉండేవారు.

మన్రో అని ఒక సివిల్‌జడ్జీ ఉండేవాడు. నేనొక కేసు ఆర్గ్యుమెంటు చెబుతూంటే, ఆయన తలవంచుకుని జడ్జిమెంటు వ్రాసేస్తున్నాడు. నేను, "ఆర్గ్యుమెంటు చెప్పకుండానే మీరు తీర్పు వ్రాసేస్తున్నారు! నేను ఎంత గొంతు చించుకుంటే మాత్రం లాభ మేమిటి?" అన్నాను. ఆయన, "నేను తీర్పు వ్రాస్తున్నానని మీ కెల్లా తెలిసింది?" అన్నాడు. "మీరు వేసిన ప్రశ్నలు, మీరు కూచునే వాలకం, మీ వ్రాత ధోరణీ చూసి, అల్లాగ అనుకున్నాను,: అన్నాను. నిజానికి ఆయన వ్రాసేది జడ్జిమెంటే!

బోడాం అనే జడ్జీ ఒకాయన ఉండేవాడు. ఆయన ఒరిజనల్‌సైడు