పుట:Naajeevitayatrat021599mbp.pdf/140

ఈ పుట ఆమోదించబడ్డది

మాత్రం ఎప్పుడూ నిద్రపోలేదు. ఆయనే ఒకసారి, అంతకుముందు అడ్వకేటు జనరల్‌గా ఉండిన ఒక భారతీయ ప్రముఖుడు ఆర్గ్యుమెంటు చెబుతూ ఉంటే తల వేలవేసి నిద్రపోయాడు. ఆయన కునుకుతున్నా ఈయన ఆర్గ్యుమెంటు మానలేదు. ఒకనిద్ర తీసి లేచి, "ఏమండీ! మీరు ఏవిషయం ఆర్గ్యూచేస్తున్నారు?" అన్నాడు. ఈయన "అయ్యా! నేను కమర్షియల్ లా విషయం ఆర్గ్యూ చేస్తున్నాను," అన్నాడు. అపైన ఆయన "ఆ అసందర్బంగా మాట్లాడతారేమిటి? కమర్షియల్ లా మీకేం తెలుసును?" అన్నాడు. అంటే ఆయ నేమీ మాట్లాడలేదు. ఆ ముక్కలు విన్న వి. కృష్ణస్వామయ్యరుగారు పెదవిచప్పరించి, "అవును! ఇది మనకి ఇల్లాగ అవవలసిందే!" అన్నాడు. అంటే బారులో ఐకమత్యం లేదనీ, ఉంటే జడ్జీలు అల్లా ప్రవర్తించలేరనీ ఆయన అభిప్రాయము.

మరి, ఒక సందర్భంలో సర్ అబ్దుల్ రహీముగారితో నాకు మాటపట్టింపు వచ్చింది. ఆయన కోర్టు శుద్ధ బహదూరీ పద్ధతిగా ఉండేది. మొదటి రోజుల్లో ఆయన చాలా నిదానంగా వింటూ, న్యాయం సరిగ్గా పాలించేవాడు. కొన్ని స్వతంత్రమైన పోకడలు కూడా కనపర్చాడు కాని, రానురాను లాయర్ల మీద బెంచీమీదనించే చికాకుపడేవాడు. పైగా అప్పటికి వి. కృష్ణస్వామి అయ్యరుగారు హైకోర్టుజడ్జీపని విడిచిపెట్టి ఎక్జిక్యూటివ్‌కౌన్సిలర్ అయ్యారు. ఆయనకికూడా తన రాష్ట్రమైన బెంగాలుకి ఎక్జిక్యూటివ్‌కౌన్సిలరు కావాలని ఆశ ఉండేది. ఆయన ఎంత సేపూ అదే దృష్టిలో ఉండేవాడు. ఒకసారి నేను ఒక సివిల్ అప్పీలు ఆయన దగ్గిర వాదిస్తున్నాను. నేను రిపోర్టు పాయింటు వివరించకుండానే, "ఆ ఇందులో ఏముంది?" అన్నాడు. నాకు ప్రాణం విసిగి, "అయ్యా ఈ కేసులో నేను నా పార్టీల దగ్గిరనించి చాలా డబ్బు తీసుకున్నాను వాళ్ళకేసు అంతా శ్రద్ధగా చదివి తమకు నివేదించదలచుకున్నాను. అల్లాంటప్పుడు నేను చెప్పకుండానే మీరు 'ఇందులో ఏముందని' అంటే ఇంక నేను చెప్పేదేమిటి? ఇది న్యాయమూర్తులకి న్యాయమైన పనికాదు," అన్నాను. అంతటితో ఆయన తట్టుకుని నిదానపడ్డాడు. తరవాత నాకూ, ఆయనకీ ఎప్పుడూ తగాదా రాలేదు.