పుట:Naajeevitayatrat021599mbp.pdf/134

ఈ పుట ఆమోదించబడ్డది

ఆశ్చర్యం కలిగేటట్లు డబ్బు సంపాదించడమూ, లౌకికంగా పేరు ప్రఖ్యాతులు పొందడమూ జరిగింది. ముందు మొదటి 7 సంవత్సరాలిని గురించి వ్రాస్తాను.

నేను మద్రాసు చేరి ప్రాక్టీసు ప్రారంభించేసరికి ఇంగ్లండు ప్రయాణం బాపతు 8 వేలూ, పుస్తకాలు వగైరాలు కొన్నబాపతు పన్నెండువేలూ కలిసి మొత్తం ఇరవై వేల అప్పు ఉంది. నేను ఆ అప్పుతో ప్రాక్టీసు ప్రారంభించాను. కాని, దైవికంగా కొద్దిరోజులకే ఆ అప్పు తీర్చి వెయ్యగలిగాను. నేటి యువకులకి జీవితంలో ఉత్సాహం కలిగించడం కోసం, ఆ సంపాదనకి కావలసిన పేరు సంపాదించుకోవడం కోసం నేను పడ్డశ్రమని గురించి కొంచెం వ్రాస్తాను.

నేను ప్రవేశించేటప్పటికే భారతీయులలో మాధవన్‌నాయర్ - (తరవాత జస్టిస్) - డాక్టర్ స్వామినాధన్, కె. పి. యన్. మీనన్‌గార్లు (క్రౌన్ ప్రోసిక్యూటరు) ప్రాక్టీసులో వుండేవారు. పి. సి. లోబో - (రిటైర్డు జిల్లాజడ్జీ) - సర్ జాన్ వాలస్ అడ్వకేట్ జనరలుగా ఉండేటప్పుడు ఆయన దగ్గిర అప్రెంటిస్‌గా ఉండేవాడు. ఆయన మధురకి పబ్లిక్ ప్రోసిక్యూటరుగా వెళ్ళిపోయాడు. బారిష్టర్లకి అప్పట్లో ఎక్కువ ప్రతిష్ఠలేని సంగతీ, వాలస్ నాకు ఇచ్చిన సలహా సంగతీ ఇదివరకే వ్రాశాను గదా! అల్లాంటి స్థితిగతులలో ప్రాక్టీసు ప్రారంభించి నిగ్రహించుకుంటూ వచ్చాను.

నేను మద్రాసు వచ్చిన సంవత్సరంలోనే కాకినాడలో వకీలుగా ఉండిన పేరి నారాయణమూర్తిగారు మద్రాసు చేరారు. ఆయన మంచి ప్రతిభాశాలి. ఆయన చేరిన కొద్దికాలానికే మేము తెలుగు ప్రాంతాల్లో ఉన్న ఫైలు ముప్పాతిక మూడుపాళ్ళవరకూ ఆకర్షించగలిగాము. కాతాలిస్టు తీసుకుంటే తెలుగువాళ్ళలో మా పేర్లు తరుచుగా కనిపిస్తూఉండేవి. నేను బారిష్టరుగా వచ్చిన కొద్దిరోజులకే ఒక సివిల్ అప్పీలులో లాకాలేజిలో ప్రొపెసరుగా ఉండిన టి. వి. శేషగిరి అయ్యరుగారితో కలిసి పనిచేయ వలసి వచ్చింది. ఆయన వయస్సులోనూ, ప్రాక్టీసులోనూ నాకు సీనియరు. అయినా బారిష్టర్ని అవడంవల్ల నాకు సీనియారిటీ వచ్చింది.