పుట:Naajeevitayatrat021599mbp.pdf/124

ఈ పుట ఆమోదించబడ్డది

ఆ దేశంలో బారిష్టర్లు అల్లాంటి స్వాతంత్ర్యం చూపించేవాళ్లు. జడ్జీలని లక్ష్యపెట్టకుండా క్లయింట్లకేసులు బలపరచేవాళ్ళు. ఆస్తికి సంబంధించిన ఇంకొక కేసులో కోర్టుప్రెసిడెంటు అయిన లార్డు జస్టిస్ మెల్టన్‌మీద అతని సవతికూతురు దావా తెచ్చింది. ఆ జడ్జీ తన తరపున సాక్ష్యం ఇచ్చుకున్నాడు. జడ్జీ మాట తోసివేయడం అనేది సాధారణ విషయంకాదు. - అ కేసులో ఆ కూతురు తరపున సర్ మాంటేగ్ హాజరు అయ్యాడు. అసలు కేసు క్రిందికోర్టు కింగ్సుబెంచి డివిజనులో జడ్జీపక్షం అయింది కాని, సర్ మాంటేగ్ న్యాయం విషయంలో సుప్రీం కోర్టు జడ్జీ అనే అభిమానం ఉండకూడదనీ, న్యాయం కోసం ఆయనమాట తోసివెయ్యాలనీ బహు సున్నితంగా వాదించాడు.

చివరికి కోర్టువారు ఆ జడ్జీ సాక్ష్యం తోసివేసి అతని కూతురు మాట అంగీకరించారు. దాంతో ఇంగ్లీషుపత్రికల్లో చాలా గందరగోళం చెలరేగింది. "ఒక జడ్జీ సాక్ష్యాన్ని ఇంకొక కోర్టువారు నమ్మకపోతే ఆయన రాజీనామా ఇవ్వాలి," అన్నారు. ఆ జడ్జీ అంతకన్న మొండివాడు. "అప్పీలు కోర్టు జడ్జీలు తప్పు అభిప్రాయం పడ్డారు కాని నేను అబద్దాలు చెప్పలేదు. కనక రాజీనామా ఇవ్వను" అన్నాడు. అక్కడ అల్లాంటి లావాదేవీలు జరుగుతూ ఉండేవి. ఇటువంటికేసులు ఏమన్నా వస్తే వాటికి స్వయంగా హాజరై చూస్తూ ఉండేవాణ్ణి.

ఈ కాలంలోనే మద్రాసు హైకోర్టు జడ్జీపని చేసి పించను పుచ్చుకున్న షెప్పర్డు అనే ఆయనతో నాకు పరిచయం కలిగింది. అప్పుడాయన ఇండియన్ కంట్రాక్టు ఆక్టు - అనే లా పుస్తకం మార్చి వ్రాస్తూ ఉండేవారు. ఆయన దానికి నన్ను సహాయం చెయ్యమని అడిగారు. అప్పటికే నేను సుమారు 10 ఏళ్ళు కోర్టులో ప్రాక్టీసు చేసి ఉండడంవల్ల ఆయన కోరిన పని తృప్తికరంగా చెయ్యగలిగాను. ఆయన తన పుస్తకంలో కూడా ఈ విషయం వ్రాశారు. తరవాత ఒకసారి ఆయనే నన్ను ఐసాక్ రూఫస్‌కి, (తరవాత ఇండియా వైస్రాయి లార్డు రీడింగుకి) ఎరుకపరచారు. ఐసాక్ రూపస్ అప్పట్లో పెద్ద లాయర్లలో లెఖ్ఖ. పుష్కలంగా డబ్బు సంపాదించేవాడు. ఆయన పంజాబ్ వాస్తవ్యుడూ,