పుట:Naajeevitayatrat021599mbp.pdf/119

ఈ పుట ఆమోదించబడ్డది

మెంటు మెంబరు ఫోర్బ్సుకి "రాజమహేంద్రవరం మునిసిపల్ సొమ్ము జాగ్రత్తగా నీకు అప్పచెబుతున్నాను సుమా!" అని ఉత్తరం వ్రాశాను. ఆయన దానిలో ఉన్న ఎత్తిపొడుపు గ్రహించి, నన్ను అభినందిస్తూ తిరిగి ఉత్తరం వ్రాశాడు. తన సోదరి ఒక ఆమె ఎడింబరోలో లాండ్ లేడీ - అంటే హోటలు యజమానురాలుగా - ఉన్నదనీ, ఆమెను కలుసుకోమనీ నాకు వ్రాసి, ఆ విషయంలో ఆమెకి కూడా ఒక ఉత్తరం వ్రాశాడు. నన్ను ఛైర్మన్ పదవినించి లాగివేయదలుచుకున్న ఫోర్బ్సుకీ నాకూ ఉన్న సంబంధం అల్లాగ పరిణమించింది.

మొదటి టెరము ఎనిమిది మాసాలూ ముగించుకుని, జూన్ 30 వ తేదీని బయలుదేరి, జూలై 15 వ తేదీని బొంబాయిమీదుగా రాజమహేంద్రవరం చేరాను. నేను తిరిగి రాజమహేంద్రవరం చేరేటప్పటికి నా మిత్రులకీ, శత్రువులకీ కూడా ఒకటే ఆశ్చర్యం. ఇంట్లో వాళ్ళ సంగతీ, బంధువుల సంగతీ వేరే చెప్పనే అక్కరలేదు. కాశీకి వెడితేనే కాటికి వెళ్ళినట్లు లెక్క చూసుకునే రోజుల్లో ఇంగ్లండు వెళ్ళి రావడం అంటే అందరికీ ఆశ్చర్యంగా వుండేది. నా మిత్రులూ, శత్రువులూ చాలామంది నేను లండన్‌లో పాడై పోతాననీ, మళ్ళీ రావడం సంశయమనీ అనుమానిస్తూ ఉండేవారు. ఒక్క రామచంద్రరావు మాత్రం నేను సంపూర్ణంగా పని నెరవేర్చుకుని వస్తాననే ధైర్యంతో ఉండేవాడు. ముఖ్యంగా ఈ దేశంలో లండన్‌లో స్త్రీల స్వేచ్చని గురించీ, తాగుబోతుతనాన్ని గురించీ వ్యాపించిఉన్న కల్లిబొల్లి కథల వల్లనూ, నా చిన్ననాటి చర్యలవల్లనూ, ఇక్కడ ఆ విషయాల్లో నాకు కొంత బలహీనత ఉండిన కారణంవల్లనూ అందరూ నేను పూర్తిగా పాడై పోతా నని అనుకున్నారు. కాని, నిజానికి ఆదేశం జీవితమే నన్ను మానసికంగా కొంత ఆ బలహీనతనించి తప్పించి, మంచిమార్గానికి మళ్ళించింది. పై కారణం చేతనే నేను తిరిగి వచ్చా ననేసరికి రాజమహేంద్రవరం అంతా ఒక వింతగా పరిగణించారు.