పుట:Naajeevitayatrat021599mbp.pdf/114

ఈ పుట ఆమోదించబడ్డది

వున్నాయి. ఆ గ్రంథాలు చదవడానికి నాకు గొప్ప అవకాశం లభించింది. ఈ సంఘ ప్రధానోద్దేశం కూడా అదే. విద్యాభిలాషులై ఆదేశం వచ్చిన భారతీయులకి తమ దేశం వచ్చిన పిమ్మట దేశసేవలో నిమగ్నులు కావడానికి తగిన విద్యావినేకాల్ని కలిగించడమే ఆ సంఘాదర్శం. అంతే కాకుండా హిందూదేశపు ఐశ్వర్వంమీద జీవయాత్రచేస్తూ ఆ దేశం ఎక్కడ వుందో, ఎంత దేశమో తెలియకుండా కాలక్షేపంచేసే ఆంగ్ల ప్రజలకి కాస్త వివేకం కలిగించడం మరి ఒక ఆదర్శం.

ఆ సంఘం తరపున తరచు సభలు జరుపుతూ ఉండేవాళ్ళు. నేను ఆ సంఘంలో చేరిన కాలానికి అప్పుడే మనదేశంలో అతివాద మితవాద విభేదాలు పెచ్చు పెరుగుతున్నాయి. నే నక్కడ ఉండగానే డబ్ల్యు. సి. బోనర్జీగారు మరణించారు. ఆయన అంత్యక్రియల సందర్భంలో రమేశచంద్రదత్తు ఉపన్యాసం చేస్తూ మన దేశంలో అతివాదం పెరిగిపోతూ ఉందనీ, వంగదేశంలో అరాజకం హెచ్చిపోతూ ఉందనీ విచారిస్తూ మాట్లాడారు. అసలు విషయం మాట అటుంచి ఆ సందర్భంలో ఆ విషయాలు మాట్లాడినందుకు అస్మదాదులకి కొందరికి కష్టం తోచి కొంచెం కటకట పడ్డాము.

నేను లండన్‌లో ఉండగానే దాదాభాయి నొరోజీ పార్లమెంటు ఎన్నిక కూడా వచ్చింది. ఆయన తరపున మేమంతా ప్రచారకులుగా పనిచేశాము. ఆ ఎన్నిక విధానం అంతా ఆంగ్లేయులే ఏర్పాటు చేసినా, అందులో భారతీయులం అందరమూ కూడా పాల్గొన్నాము. అప్పుడు నే నొక ఏజంటుగా పనిచేశాను. ప్రతి పక్షియులు, కొన్ని చోట్ల నొరోజీ నల్లవాడనీ, తెల్లవాళ్ళు తెల్లవాళ్ళకే వోట్లు ఇవ్వాలనీ ప్రచారంచేశారు.

అప్పుడు మాకు ఏమీ తోచక మా నాయకుడైన ఇంగ్లీషు ఆయన్ని సలహా అడిగాము. ఆయన, "ఇంత మాత్రానికే నా దగ్గిరికి రావాలా? దాదాభాయి నల్లవాడైతే ఆయనమీద పోటీ చేసేవాడు తెల్లదనంలో రంగు తగ్గిన జ్యూ. అందుచేత సమర్థతనిబట్టి వోటు ఇవ్వండి!" అని చెప్పమన్నాడు. పైగా, దాదాభాయి రంగులో తెల్లవాళ్ళకన్న తెల్లగా వుంటాడని చెప్పమన్నాడు. దాదాభాయి మంచి తేజశ్శాలి, యోగీ