పుట:Naajeevitayatrat021599mbp.pdf/110

ఈ పుట ఆమోదించబడ్డది

మొట్టమొదటి కొద్దిరోజుల్లో ఆంగ్లజీవితం చూశాక నాకు కలిగిన అభిప్రాయాలు వ్రాస్తాను. రైలు దిగుతూంటేనే కూలీల కట్టుబాట్లని గురించి నాకు కలిగిన ఆశ్చర్యం ఇదివరకే వెలిబుచ్చాను. మొత్తంమీద బజారులోగాని, హోటళ్ళలో గాని, సినీమాలలో గాని ఎక్కడ చూసినా సాధారణ జీవితంలో నిజాయితీ, శ్రద్ధ ఎక్కువగా కనిపించాయి. అక్కడ కాలం వృథా చెయ్యకుండా వుండే చురుకుతనం బాగా గోచరించింది. బజారులోకి వెడితే కూరగాయ లమ్మే స్త్రీలతో గాని, పురుషులతోగాని బేరమాడ నక్కరలేదు. ఒకే వెల. మంచి నాణ్యం. ఇక పోస్టాఫీసుకి వెడితే అక్కడ వుండే స్త్రీ అతి మర్యాదగా, క్షణం ఆలస్యం లేకుండా కౌంటరు దగ్గిర మన పని చూసి, వెంటనే పంపించివేస్తుంది.

ఒకసారి నేను ఎడింబరోకి కొన్నిపౌనులు మనియార్డరు చేద్దామని ఒక పోస్టాఫీసుకి వెళ్ళాను. 16, 17 ఏళ్ళ యువతి నా దగ్గిర డబ్బూ, ఫారమూ పుచ్చుకుని ఉత్తరక్షణంలోనే ఇతరుల పని చూడడం మొదలు పెట్టింది. నేను మన దేశంలో అలవాటుకొద్దీ రసీదుకోసం కాచుకుని కూర్చున్నాను. కొంతసేపటికి ఆమె నన్ను చూసి "అట్లాగ నిలబడ్డారేమిటి?" అని అడిగింది. "రసీదు కోసం" అని చెప్పేసరికి, "ఇక్కడ రసీదు లివ్వరు. ఈ పాటికి మీ డబ్బు చేరవలసిన చోటికి చేరే వుంటుంది, మీరు వెళ్ళవచ్చును," అని చెప్పింది.

అక్కడ సామాన్యజనులు స్నానం చెయ్యడానికి స్నానాలగదులు ఏర్పాటై వుంటాయి. వాటిని ఉపయోగించే జనం ఒకరి నొకరు తోసుకోరు. ముందు వచ్చిన వాళ్ళు ముందు తమపని ముగించుకుని పోతూ ఉంటారు. నాటకశాలల దగ్గిర టిక్కట్లు కొనేచోట, హోటళ్ళలోనూ, రైలుస్టేషన్‌లలోనూ ముందువచ్చిన వాళ్ళకి ముందుగా టిక్కట్లు ఇచ్చివేసి పంపిస్తారు. జనంకూడా గుంపులుగూడి తోసుకోకుండా ఒక్క వరసగా నిలబడి, ఒకళ్ళ వెనక ఒకళ్ళు తమతమ పనులు నెరవేర్చుకుంటూ ఉంటారు. ట్రాముల్లోనూ, గుర్రపుబళ్ళలోనూ డ్రైవర్లు ప్రయాణీకుల్ని అతిమర్యాదగా చూస్తారు. ఈ గుఱ్ఱపు బళ్ళవాళ్ళు