పుట:Naajeevitayatrat021599mbp.pdf/109

ఈ పుట ఆమోదించబడ్డది

మంది వృత్తిలో ముందుకి రాలేక కేవలం డిన్నరు బారిష్టర్లనే అప్రతిష్ట తెచ్చుకున్నారు. అందుచేతనే మద్రాసులో కొద్ది కాలానికే బారిష్టర్ల పరువు సన్నగిలింది. మైలాపూరు మేధావుల సునిశిత బుద్ధివిశేషం ఈ డిన్నరుబారిష్టర్లని నెట్టివేయడంలో ఆశ్చర్యమేమివుంది? బారిష్టరు చదువు పద్ధతి అల్లాగ వున్నప్పటికీ, కష్టపడి చదువుకునేవాళ్ళకి పరిపూర్ణమైన అవకాశాలు ఉండేవి. ఆ కాలంలో ఈ న్యాయవిద్య అంతా ఇంగ్లండులో కౌన్సిల్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ చేతుల్లో వుండేది. ఆ దేశంలో నాలుగుచోట్ల పెద్దపెద్ద న్యాయశాస్త్ర గ్రంథాలయాలు ఏర్పాటుచేసి వాటికి చేరికగా, నివాసానికీ, భోజనానికీ చక్కని వసతులు ఏర్పాట్లు చేస్తారు. వాటినే 'ఇన్‌'లు అంటారు. టెరముకి ఇన్ని డిన్నర్‌లు - అంటే విందులని - పరిమితి వుంటుంది. ఈ విందులికి తప్పకుండా హాజరు కావాలి. మన యూనివర్సిటీల్లో అట్టెండెన్సు ఎంత ముఖ్యమో ఇక్కడ ఇది అంత ముఖ్యము.

ఆ విందులే కాకుండా కౌన్సిల్ ఆఫ్ లీగలు ఎడ్యుకేషన్‌వారు ఏర్పాటు చేసిన లెక్చర్లు వుంటాయి. వాటికీ హాజరు కావాలి. ఆ లెక్చర్లు చాలా ఉన్నతశ్రేణిలో ఉంటాయి. ఆ లెక్చర్లు విని లైబ్రరీలో కూర్చుని శ్రద్ధగా చదువుకుని మిగిలిన కాలంలో సమీపంలో వుండే ఇంగ్లీషు కోర్టుల్లో వ్యవహారాలు పరిశీలించే శ్రద్ధావంతులికి బారిష్టరు చదువు ప్రశస్తమైనదని చెప్పక తప్పదు. నేను మన దేశంలో 8 సంవత్సరాలు సివిల్, క్రిమినలు కేసుల్లో పనిచేసి న్యాయశాస్త్ర ప్రధానసూత్రాలు అవగాహన చేసుకుని అనుభవం సంపాదించాను. అంతేకాక, చిన్ననాటినించీ ఈ వకీలు వృత్తి అంతం కనుక్కోవాలనే కుతూహలంతో వుండేవాణ్ణి. అందుచేత ఈ విద్యమీద బాగా లక్ష్యం ఉంచి చదివేవాణ్ణి. లా కౌన్సిలు ఉపన్యాసాలు అన్నీ శ్రద్ధపట్టి సంగ్రహంగా వ్రాసుకునేవాణ్ణి. కోర్సు పూర్తి అయ్యేసరికి నోట్సు పుస్తకాలన్నీ నా యెత్తుని పెరిగాయి. నేను పాఠ్య గ్రంథాలు శ్రద్ధగా చదువుతూ, అవకాశం ఉన్నప్పుడల్లా ఇంగ్లీషు కోర్టులలో పద్ధతులూ, పెద్దపెద్ద బారిష్టర్లు నడిచే రీతులూ చూస్తూ వుండేవాణ్ణి.