పుట:Naajeevitayatrat021599mbp.pdf/105

ఈ పుట ఆమోదించబడ్డది

9

ఇంగ్లండు ప్రయాణం

అప్పటికి రాజమహేంద్రవరంలో నా సంసారం స్థిరపడింది. సంపాదన పుష్కలంగా ఉండడమూ, బంధువు లంతా తృప్తి పడడమూ జరిగింది. ఇల్లాంటి స్థితిలో లండన్ ప్రయాణం అనేసరికి ఇంట్లో కల్లోలం పుట్టింది. ఆ కాలంలో సముద్రయానం అంటే కులంపోయిం దన్నమాటే. ఆ కారణం పురస్కరించుకుని రేకపిల్లి లచ్చయ్యగారు అనే పురోహితుడు మా యింట్లో ఆడవాళ్ళకి - ముఖ్యంగా మా అమ్మగారికి - బాగా ఆందోళన కలిగించాడు.

అంతకి పూర్వమే సుబ్బారావుపంతులుగారికి సుస్తీచేస్తే, వైద్యులు ఆయనకి, "ఆరోగ్యంకోసం సముద్రయానం అవసరం" అని చెప్పారు. ఆయన అప్పుడే వీరేశలింగం పంతులుగారితో తగాదాపడి సనాతన హిందూ ధర్మోద్ధరణకోసం హిందూ సమాజం స్థాపించి ఉండడంచేతనూ, మాధ్వస్వాముల వారి ప్రాపకం చెడగొట్టుకోవడం ఇష్టంలేని వారవడం చేతనూ, చాలా తటపటాయించి, చివరికి తూర్పు తీరాన్ని ఓడప్రయాణంచేసి చక్కావచ్చారు. దీనికి మాధ్వస్వాములవారు అంగీకరించారు కూడాను. ఆ సంగతి మా అమ్మగారితో చెప్పి ఆవిడ మనస్సుకి తృప్తి కలిగించాను.

అసలు అప్పటికి మనదేశంలో ఎవ్వరూ బారిష్టరు చదువుకోసం ఇంగ్లండు పోయినవారులేరు. అంతకిముందు ఎవరో ఒక క్షత్రియుడు 50 సంవత్సరాల క్రితం విశాఖపట్నంనించి సీమ వెళ్ళారట. కాని ఆయన లెఖ్ఖలో పడలేదు. యం. ఆర్. అయ్యంగారు అనే దాక్షిణాత్యులు ఒకరు బారిష్టరు అయి రాజమహేంద్రవరంలో కొంతకాలం కిందట ప్రాక్టీసుచేస్తూ వచ్చారు. ఆయన చాలా తెలివైనవాడేగాని, తాగడం అలవాటు అయింది. ఒక్కొక్కప్పుడు ఆ నిషామీద వాదితరపున వకాల్తీ పుచ్చుకుని ప్రతివాది తరపున ఆర్గ్యుమెంటు చెప్పేవారు. ఆయన