పుట:Naajeevitayatrat021599mbp.pdf/104

ఈ పుట ఆమోదించబడ్డది

మౌతుంది!" అన్నాను. అందుమీద ఆయన వేలకి వేలు అవసరం లేదనీ, ఆరువేల రూపాయలతో కోర్సు అంతా పూర్తిచెయ్యవచ్చుననీ, నేను నెలకి ఆరు పౌనులతో కాలక్షేపం చేశాననీ చెప్పారు. నేను, "అది అంత సుళువై, ఐదారువేల రూపాయలలో అయితే ప్రయత్నం చేస్తా" నని చెప్పాను.

వాస్తవానికి ఆ సంభాషణే నా జీవితాన్ని ముందుకి తోయగలిగిన విశేష ఘట్టం. నేను రాజమహేంద్రవరంలో సెకండుగ్రేడు ప్లీడరుగా పనిచేస్తూ శత్రువుల్ని నిర్జించుకుంటూ అప్పటికి తృప్తికరమైన జీవితం గడుపుతూ వున్నా, నాకుమాత్రం ఆ స్థానం ఇరుకుగా కనిపించేది. విశాలమైన ఆవరణలో విచ్చలవిడిగా సంచారం చేసే మనస్తత్వం కావడంచేత, ఈ ఆలోచన నాకు బాగా తల కెక్కింది. వెంటనే రాజమహేంద్రవరం వచ్చివేసి నా మిత్రులైన కంచుమర్తి రామచంద్రరావు గారితో, నాకూ స్వామినాథన్‌గారికీ జరిగిన సంభాషణ అంతాచెప్పాను. ఆయన అప్పుడే సగం ఖర్చుపెట్టుకోడానికి అంగీకరించి ప్రోత్సహించారు. నాకు మిత్రులూ, చాటపర్రు వాస్తవ్యులూ అయిన మాగంటి లక్ష్మణదాసుగారికి కబురు పంపించగా, ఆయన వచ్చి మిగిలిన మూడువేలూ ఇవ్వడానికి అంగీకరించారు. నేను డబ్బు సర్దుబాటు కావడంతోనే ఇంగ్లండు వెళ్ళిపోవడానికి నిశ్చయం చేశాను.

ఇంక ఇక్కడ ఏలూరి లక్ష్మీనరసింహంగారి కేసు మిగిలి వుంది. కొంత కేసు విస్ దగ్గిర జరిగింది. ఆ కేసు క్రాస్ పరీక్షలో మునిసిపల్ కక్షలు వగైరాలన్నీ చాలావరకు రుజువు చేశాను. అ తరవార మళ్ళీ హైకోర్టుకి ట్రాన్సుఫరు పెట్టాను. కొంత సాక్ష్యం రుజువుమీద జాన్ ఆడమ్సునిపెట్టి వాదిస్తే ట్రాన్సుఫరుకి ఆర్డరు పాసయింది. ఆ కేసు విశాఖపట్నానికి ట్రాన్సుఫరు చేశారు. విశాఖపట్నంలో కూడా నేనే కేసు నడిపించి లక్ష్మీనరసింహం గారిమీద కేసు లేకుండా తప్పించి వేశాను.