పుట:Naajeevitayatrat021599mbp.pdf/101

ఈ పుట ఆమోదించబడ్డది

రంగయ్య ఆ క్రితం రాత్రి ప్రకాశం ఇంటికి వచ్చాడని అన్నాడు. ఆ క్రితం రాత్రి 8, 9, గంటలకి నేనూ, వెంకటరత్నమూ, ఇంకా కొందరు స్నేహితులూ కుర్చీలు వేసుకుని మా ఇంటిముందర కూర్చుని పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ ఉండగా రంగయ్య వచ్చినమాట వాస్తవమే. క్లయింట్లు రాత్రిళ్ళు వచ్చి మాట్లాడి పోవడంలో విశేష మేముంది? ప్రాక్టీసు వృద్ధి చేసుకోవా లని కష్టపడే ప్రతీ ప్లీడరూ, క్లయింట్లతో రాత్రిళ్ళు నిదానంగా మాట్లాడుకోవడం సహజమే కదా. ఈ సామాన్య విషయాన్ని గోరంతలు కొండంతలు చేసి, నా శత్రువులు నామీదికి దూకదలచినపుడు, నా స్నేహితులు కొందరు వెంకటరత్నం దగ్గిరికి వెళ్ళి, "నువ్వు అన్న ఆ మాటలవల్ల ప్రకాశానికి ఆపత్తు వచ్చేటట్టువుంది. పోనీ, నువ్వు ఆ విషయం చెప్పకుండా ఉండకూడదా?" అని సలహా యిచ్చారు. అతను, "ఒకసారి నేను చెప్పిన తరవాత - అందులోనూ ఆ సంగతి నిజమైనప్పుడు - నేనెందుకు కా దనాలి?" అన్నాడు. దానికి స్నేహితులు బాధపడ్డారు. కాని, అప్పుడూ ఇప్పుడూ కూడా "వెంకటరత్నం మాటే సరి అయినది" అని నా అభిప్రాయం.

తరవాత పోలీసులు పెరుమాళ్ళ రంగయ్యమీద కేసు పెట్టారు. ఆ కేసులో మేజస్ట్రీటుకోర్టులో నేనే పని చేశాను. కేసు సెషన్సుకి వెళ్ళింది. అప్పుడు నాయందు సుముఖుడు కాని హేమ్నెట్‌దొరే జిల్లా జడ్జీ. ఆ కారణంచేత కూడా నా శత్రువులు నన్నందులో ఇరికించడానికి ఉబలాట పడ్డారు. నేను సెషన్సు విచారణకి మద్రాసునించి బారిష్టర్ జాన్ ఆడమ్సుని తీసుకుని వచ్చాను. సహజంగా కేసులో ఏమీ బలంలేక పోవడంచేత, ఆ జడ్జీ రంగయ్యని నిర్దోషిగా నిర్ణయించి ఒదిలివేశాడు. అంతటితో శత్రువులు పన్నిన మరొక ఉచ్చునించి బయటపడ్డాను. ఒక్కొక్కప్పుడు జీతం భత్యంలేని ఈ స్వల్పాధికారాలకోసం ఎందుకింత శత్రుత్వం వచ్చిందా అనే విషయం ఆలోచిస్తే నాకే ఆశ్చర్యంగా వుంటుంది.

ఈ గంద్రగోళా లెట్లా వున్నా మునిసిపల్ పరిపాలన యథా