ఈ పుట ఆమోదించబడ్డది

పోల్చదగిన రాజకీయ వేత్తలేరని చెప్పవచ్చు. ఒకసారి ఒక డచ్‌ దినపత్రిక "తెగ బారెడు పేరుగల ఈ మద్రాసు గుంటనక్క" అని ఆయనను గురించి రాస్తూ అభివర్ణించింది. అంటే, ఎత్తులు, జిత్తులమారి అని అర్థం. ఆ పద ప్రయోగాన్ని నేను అంగీకరించనుకాని, దాని అంతరార్ధంతో ఏకీభవిస్తాను.

ఎప్పుడైతే ఆయన నా వ్యాసాలు చాలా బాగున్నాయని కితాబు ఇచ్చారో అప్పుడే నాకు అనిపించింది - ఆయనతో మాటల "ఎన్‌ కౌంటర్‌"కు సిద్ధంగా వుండాలని!

"అంత తీవ్రమైన భాషలో రాయవలసిన అవసరం వుందా?" అని ఆయన ప్రశ్నించారు.

"మీరు వ్యతిరేకిస్తున్న ఆంధ్ర ప్రాజెక్టులు, ఆంధ్రరాష్ట్ర నిర్మాణం తెలుగు వారికి ప్రాణప్రదమైనవి. వారి భవిష్యత్తు వాటిపై ఆధారపడి వుంది. అందువల్ల, మా ఆందోళన తీవ్రతను వ్యక్తంచేయడానికి అంతతీవ్రమైన భాష ప్రయోగించక తప్పలేదు. క్షమించండి". అన్నాను. అప్పటికి ఆయన వయస్సు 74 సంవత్సరాలు. ఆయన మళ్లీ చిరునవ్వు నవ్వారు.

"మీకు పెళ్లి అయిందా?"

"మీకు పెళ్లి అయిందా?" ఆయన ప్రశ్న

"ఇంకా కాలేదండీ! అదెందుకు?" అని నేను కొంచెం బిడియంగానే అడిగాను.

"పెళ్లి అయితే, మీ కలంలో ఈ "వేడి" వుండదు" అంటూ చిరునవ్వు నవ్వారు.

"ఆంధ్రకేసరి" ప్రకాశం గారు ఎలా వున్నారని ప్రశ్నించారు. "మీరు రోజూ శాసనమండలిలో చూస్తున్నారు కదండీ! బాగానే వున్నారు" అన్నాను.