ఈ పుట ఆమోదించబడ్డది

రహస్య సమాచారం అందింది. ఈ సమాచారాన్ని నా చెవిలో వూదింది - శ్రీ శ్రీపతి కూనారావు అనే సి.ఐ.డి. పోలీసు హెడ్‌ కానిస్టేబుల్‌. ఆయన మా స్వగ్రామం పామర్రు వాసి.

"మీరు రాసిన ఉద్రేక పూరితమైన సంపాదకీయం ప్రజలను రెచ్చగొట్టేదిగా వున్నదని ప్రభుత్వం భావిస్తున్నది. అందువల్ల, మీరు అలాంటి సంపాదకీయం రాసినందుకు విచారిస్తున్నట్టు మీ పత్రికలోనే ఒక ప్రకటన వేస్తే, మీ పై అరెస్టు వారెంట్‌ అమలు కాకుండా నేను చూస్తాను" అంటూ ఆయన నన్ను ఒప్పించడానికి ప్రయత్నించారు. అందుకు కారణం కేవలం ఆయన, నేను ఒకే గ్రామవాసులం కావడం వల్ల నా పట్ల ఆయనకు గల అభిమాన వాత్సల్యాల వల్లనే. ఆయన వయస్సులో నా కంటె చాలా పెద్దవాడు.

"నేను వ్రాసిన సంపాదకీయానికి క్షమాపణ ప్రకటన చేయడం ఏ పరిస్థితిలోను జరగదు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనే అవకాశం, అందువల్ల జైలుకు వెళ్లే అవకాశం నాకు ఎటూ లభించలేదు. ఇది మంచి అవకాశం. ఇప్పుడైనా ఈ "విశాలాంధ్ర" ఉద్యమం పేరుతో జైలుకు వెళ్లే అవకాశం లభిస్తుంది" అని నేను ఆ పోలీసు మిత్రునికి చెప్పాను. నా పత్రికా స్వేచ్ఛా ప్రవృత్తికి ఆయన సంతోషించాడు.

ఇంతలో ప్రజాస్వామికవాది అయిన ప్రధాని నెహ్రూ ప్రజాభిప్రాయానికి తలవొగ్గి, హైదరాబాద్‌ రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తున్నదని, అందువల్ల తెలంగాణా, ఆంధ్రప్రాంతాల ఏకీకరణ జరుగుతుందని 1956 ప్రారంభంలో నిజామాబాద్‌ సభలో ప్రకటించారు. అందువల్ల, నాపై అరెస్టు వారెంట్‌ జారీ కాలేదు! "స్వరాజ్య" సాధనోద్యమంలో జైలుకు వెళ్లే అవకాశం లభించకపోయినా, "స్వరాష్ట్ర" సాధనోద్యమంలో జైలు ముఖం చూచే అవకాశం తప్పిపోయినందుకు కొంత ఆశాభంగం చెందాను!