ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ అక్కినేని నన్ను హైదరాబాద్‌ ఆహ్వానించి, పాత్రికేయులు, సినీ ప్రముఖుల సమక్షంలో సన్మానం చేశారు.

ఆ సభకు ముఖ్య అతిధిగా ప్రఖ్యాత సినీ దర్శకులు "కళా తపస్వి" శ్రీ కె. విశ్వనాథ్‌ హాజరైనారు.

మూడు "పి" లు

సినీ ప్రపంచంతో నాకు గల ఈ సంబంధం, అనుబంధాలను గమనించి, 1978లో నేను అధికార భాషా సంఘం సభ్యుడుగా నియమించబడిన సందర్భంగా విజయవాడలో జరిగిన అభినందన సభలో ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆ సంఘం అధ్యక్షులు శ్రీ వందేమాతరం రామచంద్రరావు -

"తుర్లపాటి ఇంత ఉన్నతికి రావడనికి మూడు "పి"లు కారణమని నా అభిప్రాయం - ప్రెస్‌ (పత్రికలు), పిక్చర్‌ (సినిమారంగం), ప్లాట్‌ ఫామ్‌ (వేదిక పై ఉపన్యాసాలు) అన్నారు.

శ్రీ తెన్నేటి షష్టిపూర్తి

శ్రీ తెన్నేటి విశ్వనాథం ప్రముఖ పార్లమెంటేరియన్‌, మహా మేధావి. కవి, గ్రంథ రచయిత. నీతి నిజాయితీలకు ఆయన మరో పేరు. "మర్యాద మన్ననలు, సంస్కృతి సభ్యతలు ఆయనలో మూర్తీభవించిన"వని ఒకసారి ఇంగ్లీషు దినపత్రిక 'ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌' వ్రాసింది. శ్రీ తెన్నేటి ఆంధ్రరాష్ట్ర ప్రథమ మంత్రివర్గంలో ఆర్ధిక, న్యాయశాఖలమంత్రి.

మద్రాసు రాష్ట్రంలో ప్రకాశం మంత్రివర్గంలో (1946 - 47) చీఫ్‌ పార్లమెంటరీ సెక్రటరీ. విశాఖపట్నం నుంచి ఆయన రెండు, మూడు సార్లు లోక్‌సభ సభ్యులుగా ఎన్నికైనారు.