ఈ పుట ఆమోదించబడ్డది

"గజారోహణం, పురవీథులలో ఊరేగింపు, శాలువాలు, పూలదండలతో సత్కారం, జ్ఞాపిక బహూకృతి - ఇవి ఆ రోజుతోనే మరచిపోయేవి. వాటితోపాటు వజ్రోత్సవ సందర్భంగా శ్రీ నాగేశ్వరరావుకు ఒక బిరుదు ప్రదానం చేస్తే, అది కలకాలం చరిత్రలో నిలిచిపోతుంది." అని నేను ప్రతిపాదించాను.

ఆహ్వాన సంఘం అధ్యక్షుడు శ్రీ పోతిన బెనర్జీ కొంచెం వెటకారంగా మాట్లాడుతారు. ఆయన సామాన్యుడు కాడు. ఆంధ్రప్రాంతంలో ప్రప్రథమ సినిమా థియేటర్‌ మారుతి సినిమా హాలు యజమాని. ఆయన తండ్రి శ్రీ పోతిన శ్రీనివాసరావు ఆ థియేటర్‌ను 1921లో నిర్మించారు.

అందువల్ల, పోతిన వారి కుటుంబానికి సినీ పరిశ్రమతో సన్నిహిత సంబంధాలుండేవి. నా ప్రతిపాదన వినగానే శ్రీ బెనర్జీ "బిరుదులు భుజకీర్తులూ దేనికి?" అని తన సహజ ధోరణిలో వ్యాఖ్యానించారు. కాని, నా ప్రతిపాదనను కమిటీలోని తక్కిన వారందరూ సమర్ధించారు. వెంటనే శ్రీ బెనర్జీ "తుర్లపాటి గారూ! బిరుదు ఇవ్వాలంటున్నారు కాబట్టి, ఆ బిరుదు ఏమిటో మీరే చెప్పండి" అన్నారు. నేను "నట సామ్రాట్‌!" అన్నాను! "తెలుగు చలనచిత్ర నట ప్రపంచానికి అక్కినేని సామ్రాట్‌. ఆయనకు సాటి ఆయనే. అందరిలో ఆయన సీనియర్‌. పైగా, ఇప్పటికి 60 చిత్రాలలో హీరోగా నటించి, "హీరో నాగేశ్వరరావు" అన్న ఖ్యాతి సంపాదించారు. ఆయన ఆ బిరుదుకు ఎంతైనా అర్హులు" అని నేను వివరించాను. నిజానికి, ఆ బిరుదు "నట సామ్రాట్‌"ను ఆ తరువాత శ్రీ అక్కినేని సభలలో ఊపుకోసం, ప్రేక్షకులలో ఉద్వేగం కలిగించడానికి "నటసామ్రాట్‌" అని ఒత్తి పలికేవాడిని! ప్రేక్షకులు ఒక్క పెట్టున హర్షధ్వానాలు చేసే వారు!

ఆ బిరుదును సన్మానం రోజున శ్రీ అక్కినేనికి యిచ్చే సన్మాన పత్రంలో చేర్చి ప్రదానం చేయాలని, సన్మానపత్రం కూడా నేనే రాయాలని, ఆ నాటి