ఈ పుట ఆమోదించబడ్డది

ఎన్నికలు జరుగుతున్నాయి. అప్పటికే నేను ప్రకాశం గారి దృష్టిలో పడ్డాను. నా కలం, గళం ఆయన దృష్టిలో పడినవని ఇంతకు పూర్వమే పేర్కొన్నాను. అప్పటిలో నేను వుంటున్న కృష్ణాజిల్లా గన్నవరం - గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వుండేది. ప్రకాశం గారు గుడివాడ నియోజకవర్గానికి తమ ప్రజా పార్టీ తరఫున నన్ను అభ్యర్థిగా నియమించదలచి, నన్ను మద్రాసు రమ్మని కబురంపారు. గన్నవరంలో ప్రజా పార్టీ నాయకుడు శ్రీ నండూరి సీతాపతి నన్ను మద్రాసు మెయిల్‌లో ప్రకాశంగారి వద్దకు తీసుకువెళ్లారు. ఆయన నన్ను చూచి, "గుడివాడ నియోజక వర్గానికి చురుకైన యువకుడిని నిలబెట్టాలనుకుంటున్నాను. నీ కిష్టమైతే చెప్పు" అన్నారు. "నాకు అంత కంటె అదృష్టం ఏ ముంటుంది పంతులు గారూ! ఇంత చిన్న వయస్సులో మీ వాత్సల్యానికి పాత్రుణ్ణి కావడం నా అదృష్టం" అన్నాను. తీరా నా వయస్సు ప్రసక్తి వచ్చేసరికి 20 ఏళ్లు! అసెంబ్లీ అభ్యర్ధికి కనీసం 25 సంవత్సరాలుండాలి. దానితో నేను "తిరుగు టపా"లో ఆ రాత్రే గన్నవరం తిరిగి వచ్చి వేశాను!

ఆ తరువాత అప్పటిలో మద్రాసు నుంచి వెలువడే "తెలుగు స్వతంత్ర" వారపత్రికలో నేను ప్రతివారం ఒక రాజకీయ వ్యాసం వ్రాసేవాడిని. ఆ పత్రికలోనే నేను అప్పటి ఆంధ్రరాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితిని గురించి, కాంగ్రెస్‌ నాయకులను గురించి ప్రధాని నెహ్రూకు రాసిన రెండు ఇంగ్లీషు లేఖలను నేనే తెలుగులోకి తర్జుమా చేసి, బహిరంగ లేఖలుగా ప్రచురించేసరికి వాటికి ఎనలేని ప్రాచుర్యం, నాకు రాష్ట్ర వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఆ పత్రికకు ప్రకాశం గారి "స్వరాజ్య"పత్రికలో సంపాదకుడుగా పనిచేసిన శ్రీ ఖాసా సుబ్బారావు ఎడిటర్‌ కాగా, శ్రీ గోరా శాస్త్రి సహాయ సంపాదకుడు. శ్రీ గోరా శాస్త్రి తెలుగులో ప్రసిద్ధ సంపాదకులలో ఒకరు. ఆయన ఆ తరువాత చాలాకాలం"ఆంధ్రభూమి" తెలుగు దినపత్రికకు ఎడిటర్‌గా వున్నారు.