ఈ పుట ఆమోదించబడ్డది

"ఎన్నికల సమయం కాబట్టి, తీరా ఢిల్లీకి వస్తే, నేను వుండకపోవచ్చు. మీరు చెప్పదలచుకున్నది లిఖిత పూర్వకంగా పంపించండి. పరిశీలిస్తానని సమాధానం రాశారు" అన్నాను.

"ఔను! అలా చేయండి" అని ఆయన మృదువుగా ప్రత్యుత్తరమిచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం డిసెంబర్‌ 27వ తేదీ రాగానే ప్రథమ ప్రధాని నెహ్రూతో నా సమావేశం విషయం తప్పని సరిగా జ్ఞాపకం వస్తుంది. నేను గర్వంగా ఆ సన్నివేశాన్ని మననం చేసుకుంటాను.

పండిట్‌ నెహ్రూ ప్రశ్న :

"ఎవరీ తుర్లపాటి?"

ఆ తరువాత నేను ప్రధాని నెహ్రూకు ఇంగ్లీషులో రెండు లేఖలు రాసి, వాటిలో ఆ నాటి ఆంధ్ర రాజకీయ పరిస్థితులను, 1952 జనరల్‌ ఎన్నికలలో కాంగ్రెస్‌ ఓటమికి గల కారణాలను వివరించాను. వాటిని తెలుగులోకి తర్జుమా చేసి, శ్రీ ఖాసా సుబ్బారావు సంపాదకత్వాన మద్రాసు నుంచి వెలువడే "తెలుగు స్వతంత్ర" వార పత్రికలో ప్రచురింపజేశాను.

ఆ రెండు వ్యాసాలు ఆంధ్రదేశంలో సంచలనం కలిగించాయి. ఆ పత్రికకు రాజకీయ, మేధావి వర్గాలలో అనన్య ప్రచారం వుండేది. నా రెండు లేఖలను చూచిన ప్రధాని నెహ్రూ ఆంధ్ర నాయకుడు, ఆ నాటి కేంద్ర మంత్రి, ఆ తరువాత భారతదేశానికి నాల్గవ రాష్ట్రపతి అయిన శ్రీ వి.వి. గిరిని "ఎవరీ తుర్లపాటి?" అని ప్రశ్నించారట! అంతకు పూర్వం విజయవాడ రైలు స్టేషన్‌లో నేను ఆయనను కలుసుకున్న విషయం ఆయన మరిచిపోయి వుంటారు. ఆ తరువాత ఆయన ఎన్నివేల మందిని కలుసుకున్నారో? అందరిలో నేను ఆయనకు ఏమి గుర్తు?