ఈ పుట ఆమోదించబడ్డది

2008 ఏప్రిల్‌ 15వ తేదీన జరపడానికి ఏర్పాట్లు జరిగాయి. అసాధారణమైన విషయం - హైదరాబాద్‌లో రాజ్‌ భవన్‌లో గవర్నర్‌ శ్రీ ఎన్‌.డి.తివారి ముఖ్య అతిధిగా వుండడానికి సమ్మతించారు. సాధారణంగా ఒక పాత్రికేయునికి, లేదా మరో ప్రముఖునికి రాజ్‌ భవన్‌లో గవర్నర్‌ సన్మానంచేయడం జరగదు. కాని, ఒక జర్నలిస్టు 60 సంవత్సరాలు నిర్విరామంగా పాత్రికేయ జీవితంలో కొనసాగడం, ఇంకా రచనలు చేస్తూనే ఉండడం శ్రీ తివారికి విశేషంగా కనిపించిందట! అందువల్లనే, రాజ్‌ భవన్‌లోనే అధికార పూర్వకంగా చేయాలని ఆయన భావించారట!

అయితే, ఎల్లుండి సన్మానం అనగా ఆ రోజు రాత్రి నాకు ఆకస్మికంగా అస్వస్థత కలిగింది. రాత్రికి రాత్రి నా కుమారుడు జవహర్లాల్‌, కోడలు లక్ష్మిశ్రీ విజయవాడలోని ప్రముఖ ఆసుపత్రిలో చేర్చారు. ఏదో తీవ్ర రుగ్మత అనుకున్నాముకాని, అన్ని పరీక్షలు చేస్తే, రక్తపుపోటు హెచ్చుగావున్నట్టు తేలింది. అందు వల్ల ప్రమాదం లేకపోయినా, హైదరాబాద్‌ వెళ్లడం, ఆ మరునాడు రెండు సన్మాన సభలలో పాల్గొనడం - ఇదంతా "రిస్క్‌" తీసుకోవడం కాగలదని డాక్టర్లు అభిప్రాయపడ్డారు.

డాక్టర్ల అభిప్రాయంవల్ల నా కుమారుడు ఆందోళనపడ్డాడు. అక్కడ ఏదైనా జరిగితే, తమ బాధ్యత లేనట్టుగా డాక్టర్లు చెప్పారట! దానితో హైదరాబాద్‌ వెళ్లరాదని నిర్ణయించుకుని, ఆ విషయం రాజ్‌ భవన్‌కు తెలియజేశాము.

గవర్నర్‌ కార్యదర్శి ఈవిషయం ఆయనకు తెలియజెప్పి, సన్మాన కార్యక్రమాన్ని వాయిదా వేద్దామని సూచించారట. "ఇది శ్రీ తుర్లపాటికి వ్యకిగతంగా చేసే సన్మానం కాదు. సుదీర్ఘమైన ఆయన జర్నలిస్టు చరిత్రకు, ఆయన కృషికి చేసే సన్మానం. అందువల్ల, సన్మాన కార్యక్రమం జరగవలసిందే. ఆయనను గురించి నేను చెప్పదలచుకున్నది చెబుతాను "అని గవర్నర్‌ శ్రీ తివారి