ఈ పుట ఆమోదించబడ్డది

లేనిదే కలిసిరాదు; మరి కొన్ని సందర్భాలలో యోగ్యతలేక పోయినా, యోగం వుంటేచాలు!

ఆరున్నర దశాబ్దాల నా రాజకీయ సాగర మథనంలో ఈ నగ్నసత్యం నాకు అనుభవైక వేద్యమైనది. ఆ యోగం ఎప్పుడు వస్తుందో, ఎవరికి వస్తుందో ఎవరికీ తెలియదు. ముఖ్యమంత్రిత్వం మూడు సార్లు వచ్చినట్టే వచ్చి, శ్రీ నేదురుమల్లి జనార్దనరెడ్డికి నాల్గవసారి కాని అది చేజిక్కలేదు! మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ సుశీల్‌ కుమార్‌ షిండేకు ఆ పదవి ఆరు సార్లు వరించి నట్టే వచ్చి, ఆఖరి నిమిషంలో పూదండ మరొకరి మెడలో పడుతూ వచ్చింది. ఏడవసారి కాని షిండే మెడలో పూలమాలపడలేదు! "నాఆరోగ్యం సరిలేదు. వచ్చే ఎన్నికలలో కూడా పోటీచేయలేను. మా వూరువెళ్లనివ్వండి "అన్న శ్రీ పి.వి. నరసింహారావును ప్రధాని పదవి వెతుక్కుంటూ రాలేదా? అనారోగ్యమన్న ఆయన ఆరోగ్యం అయిదేళ్లపాటు ఆయన చేత అద్వితీయంగా పరిపాలన చేయించలేదా? బ్రిటిష్‌ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడానికి విక్టోరియా రాణి ఆహ్వానంపై బకింగ్‌ హామ్‌ రాజభవనానికి మెతున్న లార్డ్‌ హాలిఫాక్స్‌కు ఆకస్మికంగా మార్గం మధ్యలో భయంకరమైన కడుపు నొప్పి వచ్చి, ఆసుపత్రి పాలుకాకపోతే, సమర్థులైన బ్రిటిష్‌ ప్రధానుల జాబితాలో ఆయన పేరు చేరి వుండేదికాదా? ఆ తరువాత జీవితాంతం తలకిందులుగా తపస్సు చేసినా, ఆయన ప్రధాని పదవి పొందగలిగాడా?

స్థిత ప్రజ్ఞ :

ఈ చరిత్ర అంతా నాలో "స్థిత ప్రజ్ఞ" భావాన్ని పాదుకొల్పింది. నాకు వచ్చిన కష్టాలు, నష్టాలు, తీవ్రరుగ్మతలతో పోలిస్తే, శాసనమండలి సభ్యత్వం మూడుసార్లు వచ్చినట్టే, వచ్చి ఆఖరు నిమిషంలో చేజారిపోవడం నా దృష్టిలో అతి స్వల్ప విషయం!