ఈ పుట ఆమోదించబడ్డది

నేను పత్రికా రచన ప్రారంభించింది 1947 మార్చి అని, ప్రథమ ఉపన్యాసం చేసింది 1947 అక్టోబర్‌ అని ఈ కథ ప్రారంభంలోనే పేర్కొన్నాను. మహాకవి దాశరధి అన్నట్టు, అప్పుడు ప్రారంభమైన నా కలం, గళాల ప్రస్థానం ఇప్పటికీ కొన సాగుతూనే వున్నది. నేను సభలలో చమత్కృతిగా అంటూవుంటాను - అప్పుడు తెరిచిన నా పెన్‌ "క్యాప్‌" ఇప్పటి వరకు మూయలేదు; అప్పుడు విప్పిన గళం ఇంకా వినిపిస్తూనే ఉన్నది. నా కలం, గళాల వయస్సు నాకు 78 సంవత్సరాలు పూర్తి అయ్యేనాటికి (2011 ఆగష్టు 10) 65 సంవత్సరాలు ! ఇంతకాలంగా ఆయురారోగ్యంతో ఉండి, కలం, గళాల ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉండడం కేవలం భగవత్కృప అని నేను భావిస్తూ ఉంటాను. ఆరోగ్యం మన చేతిలో కొంత వరకు ఉన్నప్పటికీ, ఆయుర్దాయం మన చేతిలో లేదు!

నా ఉపన్యాసాల సంఖ్య, ముఖ్యంగా నేను అధ్యక్షత వహించిన సభల సంఖ్య 1993 నాటికి పదివేలు కాగా, అది "గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్"కు వెళ్లగా, దాదాపు అర్థ శతాబ్ది కాలంలో ఏ పదవీ లేకుండా కేవలం ఉపన్యాసకుడుగా అన్ని సభలకు అధ్యక్షత వహించిన రికార్డు ఇంత వరకు తమకు ఎక్కడా లభించలేదని, అది అపూర్వమని, ఇందుకు నన్ను అభినందిస్తున్నట్టు "గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్ఠ్" ఎడిటర్‌ ఆల్మండ్‌ బ్రూక్స్ 1993లో నాకు లేఖ రాశారు.

ఈ వార్త దేశ విదేశాలలో రేడియోలలోను, టి.వి.లలోను ప్రసారమైనది. ఇది తెలిసిన అప్పటి భారత ప్రధాని శ్రీ పి.వి. నరసింహా రావు నన్ను అభినందించారు. విజయవాడలో అన్ని పార్టీల నాయకులు పాల్గొన్న సభలో నాకు "దశసహస్ర సభాకేసరి" అనే బిరుదు ప్రదానం చేశారు.

అంతేకాదు - విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ వారు నన్ను