ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక.

ఈ రామాయణము రచించినది మొల్ల. ఈ యమ కుమ్మరకొలపు రతనము. ఆతుకూరి కేసవశెట్టి కొమరితెనని గద్యయందు వ్రాసికొనియున్నదేకాని భర్తపేరు బేర్కొనలేదు. దీనింబట్టి యీ కవయిత్రి బాలవితంతువై పిన్ననాట నుండి తండ్రియింటనే యుండి గ్రంథరచనా లాలసయై జీవయాత్ర గడపినట్లు తలంపవలసి వచ్చుచున్నది. నెల్లూరు మండలస్థ గోపవరగ్రామ మీ నారీశిరోమణి నివాసమని యీ పొత్తమందలి కవిస్తుతివలన దెలియవచ్చుచున్నది. ఇందు రామాయణకథను మిక్కిలి సంకుచితపరచి వ్రాసియున్నను ముఖ్యమగు పట్టులమాత్రము వదలలేదు. కవిత్వము లలితపదభూయిష్టమై, ధారాళమై మృదుమధురశైలిని నొప్పుచున్నయది. వ్యాకరణలోపము లందందు గన్పడుచున్నను నీ కవయిత్రీ రచనాపాటవము సాధారణ కవిరచనా సామర్ధ్యమున కేమాత్రమును దీసిపోవుటలేదు. ఈ యువతీలలామ క్రీ. శ. 16 వ శతాబ్దమందున్నటుల గనుపట్టుచున్నయది. స్త్రీ విద్య యత్యావశ్యకమని పెనుగులాడు నీవింశతి శతాబ్దమున స్త్రీ లిట్టి చక్కని కయిత రచించు నేర్పలపడుటకుం దగు విద్యాప్రణాళికను విద్యాశాఖవారు పాఠశాలలందు జదువు బాలికలకు నిర్ణయింతురుగాక యని నమ్ముచున్నారము.

క. కో. రా.