ఆరణ్యకాండము
---
క. ముని దత్త ధను ర్వేదా !
మునినాథ ప్రియ సతీ సుపూజిత పాదా !
జన కార్చిత గుణ ధామా !
సనకాది స్తవ్య నామ ! జానకి రామా ! ||1||
పంచవటిలో సీతా రాముల మధుర జీవనము
వ.శ్రీనారదమునీశ్వరుండు వాల్మికి కెఱింగించినతెఱంగు విని పించెద. |2|
చ. ఇతనికిఁ బాదచారితన మేటికి వచ్చెనొ పట్టభద్రుఁ, డీ
సతి నవ రూప రేఖలను జక్కని దయ్యును నిట్టి దుర్దశల్
ప్రతివసియించు టెట్లొ రతిరాజ సమానుల వీరి నేల యీ
గతిఁ బడఁద్రోచె బ్రహ్మ యని కాంతురు చెంచెత లమ్ముహాత్ములన్. ||3||
సీ. నడువనేరని కొమ్మయడుగులు పొక్కులై
శర్కరస్థలముల శ్రమముఁ జెందె
వీచిన చేతుల వ్రేళ్ళు నెత్తురు గ్రమ్మి
పొటమర్లు కెంపులపోల్కి నమరె
వడిగాలి సుడివడి వాడిన లెఁ దీఁగ
భావంబునను మేనిచేవ తఱిగెఁ
బూర్ణ చంద్రునికాంతి పున్నమ వేకువఁ
గనుపట్టుగతి మోము కళల విడిచె
తే. దవుని నడుగడుగునకుఁ గై దండఁ గొనుచు
నెగడుదప్పిని నిట్టూర్పు లెగసి లెగసి చిరుగుఁ
బెదవు లెండఁగ నీడకు నుదిల గొనుచు,
మనసులోఁ జేవ యీఁతగఁ జనెడు వేళ. ||4||