భూమిక
---
ఈ రామాయణమును రచించినది ఆతుకూరి మొల్ల. ఈమె తండ్రిపేరు కేసనసెట్టి. ఈకవయిత్రి నివాసస్థానము నెల్లూరు మండలములోని గోపవరము అని గ్రంథమువలనఁ దెలియుచున్నది. ఈమె యేకాలమునం దుండెడిదో నిర్ణయించుటకుఁ దగినయాధారములిప్పటికిని గనుపట్టవు. కాని తనగ్రంథములోని కవిస్తుతిలో శ్రీనాథుని నతనికిఁ బూర్వులను బేర్కొనియుంటచే శ్రీనాథునకుఁ దరువాతి యనిమాత్రము తేలును. ఈమె కృష్ణదేవరాయలకాలములో నున్నట్లు చెప్పుదురు గాని నిర్ధారణ సేయుటకుమాత్ర మాధార మంతగా లేదు. అట్లేని యీమె పదునాఱవశతాబ్దములోనిది కావచ్చును. ఈమె యేవంశమునంబొడమెనో తెల్పుటకుఁ దగిన యాధారము లేకున్నను గులాల కులసంభూతురా లనిమాత్రము వాడుకలో నున్నది. స్త్రీలలోఁ గవిత్వము సెప్పువా రీమెకు ముం దున్నట్లు తోఁపదు. ఈమె కవిత్వమునందలి గుణదోషములను నేను రూపించి వ్రాయుటకంటె నాభారమును జదువరులకే వదలిన బాగుగ నుండునని తోఁచి యట్లుచేసితిని.
ఈగ్రంథమును బ్రాచీనపుస్తకాధారమున మాతండ్రిగా రొకశుద్ధప్రతివ్రాయించియుండియు నేకారణముచేతనో ముద్రింపించి ప్రకటింపరైరి. ఇదివఱ కీమొల్లరామాయణమెన్నోసారులు ముద్రింపఁబడినది. ఇటీవల నొకప్పుడు మాతండ్రిగారు