పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/170

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

151


నలుగురు - ఆర్త్విజ్యము చేయcగా - సర్వతోముఖ పౌండరీకాంత యజ్ఞములు చేసినాఁడు. నాగేశ్వరయజ్వకొడుకు కొండుభట్టు, ఈతనికొడుకు నాగేశ్వరుఁడు, నాగేశ్వరుని కొడుకు చంపూరామాయణ వ్యాఖ్యాత నారాయణ పండితుఁడు అని చంపూరామాయణ వ్యాఖ్యాపీఠికా శ్లోకములం దున్నది.

కాలము

ఈ వంశమువారిలో సుప్రఖ్యాతుఁడు మల్లినాథుఁడుగదా! ఆయన వర్తిల్లినకాలమునుమాత్ర మిక్కడ నిర్ణయించుచున్నాను. ఇంతకుముం దీయనకాలమునుగూర్చి విస్పష్టపరిజ్ఞానము లేదు. మల్లినాథుని గ్రంథములలో సర్వజ్ఞ సింగభూపాలుని రసార్ణవసుధాకర ముదాహరింపcబడినది. కావున నాతcడు సర్వజ్ఞసింగభూపతికి సమకాలమువాఁడుగాని తర్వాతివాఁడు గాని యగును. సింగభూపాలుని కాలనిర్ణయము తగవులతో నిండి యున్నది. ఇద్దఱు సర్వజ్ఞసింగభూపాలు రున్నారు. స్థూలముగా నిక్కడ నింతమట్టు వ్రాయుచున్నాను. 1380-1450 ప్రాంతమువారు వా రిర్వురును. మల్లినాథుఁడు వారిలో మొదటి సింగభూపాలుకాలము వాఁడని నేను గొన్నియాధారములచే నిర్ణయించు కొన్నాను. మల్లినాథునితాత ప్రతాపరుద్రునిచే సమ్మానితుఁ డగుటచేత మల్లినాథుఁడు సింగభూపతికిఁ దర్వాతికాలమువాఁడు కానేరఁడు. మల్లినాథునికొడుకు కుమారస్వామి సోమపీధి తనప్రతాపరుద్రీయవ్యాఖ్యలోఁ బెద్దకోమటివేమభూపాలునిసాహిత్యచింతామణి నుదాహరించినాఁడు. పెద్దకోమటి వేమారెడ్డి 1400 మొదలు 1420 దాఁక రాజ్యపాలనము చేసెను. కుమారస్వామిసోమపీథి 1450 ప్రాంతమువాఁడు.


  • * *