ఈ పుట ఆమోదించబడ్డది

కొందరు ఏ విధముగా వ్యతిరేఖముగా ఉన్నారో రెండు ఉదాహరణలను తీసుకొని చూస్తాము. బైబిలును చదివిన క్రైస్తవులు మనిషికి ఒకే జన్మకలదు, చచ్చిన తర్వాత ఎవడూ పుట్టడని, పునర్జన్మలేదని అంటున్నారు. అది నిజమేనని చాలామంది నమ్ముచున్నారు. ఈ మాట దేవుని మాటకు వ్యతిరేఖమైనదని ఎవరు యోచించలేదు. దేవునికి వ్యతిరేఖమైన ఆ విషయమును వివరించు కొందాము. బైబిలు కొత్త నిబంధనలో మత్తయి సువార్త 12వ అధ్యాయమందు 32వ వాక్యములో ఈ విధముగా ఉన్నది. "మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడు వానికి పాపక్షమాపణ కలదుగానీ, పరిశుద్దాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈయుగమందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు." ఈ వాక్యమును విడదీసి చూస్తే ఒకరు దేవుని కుమారుడు, మరియొకరు పరిశుద్దాత్మ, మూడవవాడు విరోధముగా మాటలాడువాడు. ఈ ముగ్గురిలో ఎల్లపుడు సర్వము అణువణువున వ్యాపించి, అందరికి సాక్షిగాయున్న పరమాత్మయే పరిశుద్దాత్మ లేక దేవుడు. దేవునికి అపరిశుద్దమైన పాపము అంటదు కావున ఆయనను పరిశుద్దాత్మ అంటున్నాము. పరిశుద్దాత్మకు ఆకారములేదు, ఆకారము లేనివానికి పేరు కూడయుండదు. అందువలన ఆయనను రూప నామములు లేనివాడని కూడ అనుచుందుము. రూపము, పేరులేని దేవుడు, అంతటా వ్యాపించియున్న దేవుడు, తన విషయమును ప్రజలకు చెప్పుటకు తన వ్యాపకమునుండి ఒక భాగమును మనిషిగా పుట్టింపజేసి మనుషులతో మాట్లాడును. దేవుడే స్వయముగా తన కోట్లాది అంశలలో ఒక అంశతో పుట్టుచున్నాడు కావున ఆయనను మనుష్య కుమారుడు అని బైబిలులో, భగవంతుడని భగవద్గీతలో అంటున్నారు. దేవుని ఒక భాగమును దేవుని కుమారుడనీ, కోట్లాది భాగములను పరిశుద్దాత్మ అని అంటున్నాము. పరిశుద్దాత్మ ఎల్లవేళల విశ్వమంతా వ్యాపించియుండగా,