ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పెద్దననుగూర్చిన కొన్ని అంశములు

పెద్దన-ఆంధ్రకవితాపితామహ బిరుదము

పెద్దనగారికన్న ముందీబిరుదమును నిరువురు కవులు ధరించిరి. మొదటివాఁడు శివదేవయ్య. ఇతఁడు "సంస్కృతాంధ్రకవుల కెల్ల పితామహుఁడు"గా నాతని వంశీయుఁడగు తుళ్లూరి శరభరాజ కవీంద్రునిచేఁ బ్రస్తుతిఁ గన్నవాఁడు. (చూడుఁడు ఆధ్యాత్మ రామాయణావతారిక - శరభరాజకవి.) తరువాతివాఁడు కొఱవి సత్యనారాయణకవి. ఇతనికి సత్తెనారన యని వ్యావహారికనామము. ఇత డాంధ్రకవితాపితామహుఁ డని యీతని తమ్ముని కొడుకు కొఱవి గోపరాజకవి "సింహాసన ద్వాత్రింశిక"లో జెప్పినాఁడు. కావున పెద్దనగారు మూఁడవవారు. పెద్దనవెనుక నీ బిరుదమును నీ క్రిందివారు ధరించిరి. కాలక్రమము సరిగా తెలియుటకు నొక పట్టిగా నిచ్చుచున్నాను.

1. శివదేవయ్య క్రీ. శ. 1260 ఆంధ్రకవితాపితామహుడు
2. కొఱవి సత్తెనారన 1400 "
3. అల్లసాని పెద్దన 1530 "
4. ఉప్పు గుండూరి వేంకటకవి 1600 "
5. ఎనమండ లక్ష్మీనృసింహకవి 1680 "
6. మండపాక పార్వతీశ్వరకవి (1833-1897) "