ఈ పుట ఆమోదించబడ్డది

రేడియో, సంగీతం

75

తీసుకుపోయి మనం వాటిని మరిచి పోయేటట్లు చేస్తుంది. లేదా, జీవితాన్ని ఎదుర్కొనేందుకు శక్తినిస్తుంది. మనకి ఉత్తేజాన్ని కలిగిస్తుంది. ప్రోత్సాహపరుస్తుంది. శాంతపరుస్తుంది. మనల్ని మనం మరిచిపోవటానికి గాని, ఉత్తేజం పొందే సాధనంగా గాని, ఏవిధంగానైనా అది, మనకి అవసరమవుతుంది. అందమైన దాని మీద ఆధారపడుతూ అనాకారియైన దాన్ని ఏవగించుకుని తప్పించుకుంటే ఆ తప్పించుకునే మార్గం అంతమైపోయినప్పుడు అది దుర్భరమైన సమస్య అవుతుంది. అందం మన సుఖజీవనానికి అవసరమైనప్పుడు, అనుభవించటం అనేది అంతమై, అనుభవం మొదలవుతుంది. అనుభవం పొందే క్షణం వేరు. అనుభూతిని వెంటాడడం వేరు. అవి పూర్తిగా పరస్పర విరుద్ధమైనవి. అనుభవం పొందటంలో అనుభోక్తను గురించి ఎరుక గాని అనుభూతులు గాని ఉండవు. అనుభవం పొందటం అంతమైనప్పుడు అనుభోక్తకు అనుభూతులు ఆరంభమవుతాయి. ఈ అనుభూతులనే అనుభోక్త కోరుతాడు, వెంట పడతాడు. అనుభూతులు అవసరమైనప్పుడు, ఇక, సంగీతం, నది, చిత్రలేఖనం మొదలైనవన్నీ మరికొంత అనుభూతిని కలుగజేయటానికి సాధనాలవుతాయి, అంతే. అనుభూతులకే ఆధిక్యం అంతా - అనుభవం పొందటానికి కాదు. ఒక అనుభవం మళ్లీ కలగాలని తపించటం అనుభూతిని కోరుకోవటమే. అనుభూతులు పునరుద్భవించేటట్లు చేయటం సాధ్యమైనట్లు అనుభవం మళ్లీ అదేవిధంగా పొందటం సాధ్యం కాదు.

అనుభూతిని కోరటం సంగీతాన్ని విడువకుండా పట్టుకునేట్లూ, అందాన్ని తన సొంతం చేసుకునేట్లూ చేస్తుంది. ఒక బాహ్య రేఖ మీదం రూపం మీద ఆధారపడటం మనలోని శూన్యతని సూచిస్తుంది. ఆ శూన్యాన్ని మనం సంగీతంతోనో, లలిత కళతోనో, ప్రయత్న పూర్వకమైన మౌనంతోనో నింపుతూ ఉంటాం. ఈ మార్పులేని శూన్యతని అనుభూతులతో నింపటమో కప్పివేయటమో చేస్తాం కాబట్టే ఉన్న స్థితి అన్నా, మనం ఉన్న పరిస్థితి అన్నా మనకి అంతులేని భయం. అనుభూతులకు ఆది, అంతం ఉంటాయి. వాటిని మళ్లీ పొందవచ్చు. విస్తృతపరచుకోవచ్చు. కాని అనుభవం పొందటానికి కాల పరిమితి లేదు. ముఖ్యమైనదేమిటంటే అనుభవం పొందటం. అనుభూతుల