ఈ పుట ఆమోదించబడ్డది

"నేను" (అహం)

61

ముందుకి సాగుతూ ఉంటాం. కాని అంతకన్న ఇంకేదో ఉందనీ, ఈ దుఃఖానికి అతీతమైనది ఇంకేదో ఉన్నదనీ మనం ఎరుగుదుము. అందుకనే మనలో మనకి నిరంతర సంఘర్షణ.

పైడాబుసరి ఎంత ఎక్కువగా ఉంటే లోపలి దారిద్ర్యం అంత ఎక్కువగా ఉంటుంది. కాని, ఈ దారిద్ర్యం నుంచి లభించే స్వేచ్ఛ గోచీ గుడ్డలో లేదు. ఈ అంతర్గత శూన్యతకి కారణం ఏదో అవాలనే కోరికే. మీరేం చేసినాసరే ఆ శూన్యాన్ని నింపలేరు. మోటుగానో, సున్నితంగానో, ఎలాగో దాన్నుంచి తప్పించుకోవచ్చు. కాని అది మీ నీడలా మిమ్మల్ని వెన్నంటి ఉంటుంది. ఈ శూన్యత వైపుకి మీరు చూడదలుచుకోకపోవచ్చు. అయినా అది అక్కడే ఉంటుంది. అహం ఎన్నివిధాల అలంకరించుకున్నా, ఎన్ని త్యజించినా, ఈ అంతరంగిక దారిద్ర్యాన్ని కప్పిపుచ్చలేదు. తన అంతరంగిక కార్యకలాపాల్లోనూ, బాహ్య కార్యకలాపాల్లోను "నేను" సంపత్తిని ఆశిస్తుంది. వాటిని అనుభవం అనీ, మరొకటి అనీ, తన వీలునీ, తృప్తినీ బట్టి ఏదో ఒక పేరుతో పిలుస్తుంది. "నేను" ఎన్నటికి అనామికగా ఉండదు. కొత్త వేషం వెయ్యవచ్చు, వేరే పేరు పెట్టుకోవచ్చు, కాని దాని వ్యక్తిత్వమే దాని సారాంశం. దాన్ని గుర్తించే పద్ధతే దాని తత్వాన్ని గ్రహించనీయకుండా చేస్తుంది. ఈ గుర్తించే ప్రక్రియ మొత్తం "నేను"ని రూపొందిస్తుంది. వ్యక్తంగా ఉన్నా, అవ్యక్తంగా ఉన్నా, దాని కార్యకలాపాలన్నీ స్వార్థపూరితమైనవే - వాటి పరిధి ఎంత పెద్దదైనా. ఏదో అవాలనో, అవకూడదనో "నేను" చేసే ప్రతి ప్రయత్నమూ ఉన్న దాన్నుంచి దూరంగా జరిగిపోయేటట్లు చేస్తుంది. దాని పేరూ, లక్షణాలూ, మానసిక బలహీనతలూ, ఆస్తులూ - ఇవి కాక "నేను" అంటే వేరే ఏముంది? ఈ లక్షణాలన్నిటినీ తీసి పారేస్తే "నేను" అనేది, అహం అనేది ఉంటుందా? ఏమీ ఉండదనే భయమే "నేను"ని ఈ కార్యకలాపాల్లోకి లాగుతుంది, కాని, అది ఏమీ కాదు. అదొక శూన్యత.

ఆ శూన్యతని మనం ఎదుర్కోగలిగినట్లయితే, బాధాకరమైన ఒంటరితనంతో ఉండగలిగినట్లయితే, భయమనేది మాయమవుతుంది. ఒక సమూలమైన పరివర్తన సంభవిస్తుంది. ఇది సంభవించటానికి ఆ శూన్యత అనుభవంలోకి రావాలి. అనుభోక్త (అనుభవించేది) కనుక ఉంటే దీనికి