ఈ పుట ఆమోదించబడ్డది

130

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

తప్పించుకోవటానికి మార్గం కోసం "ప్రేమ" అనే పదాన్ని ఉపయోగిస్తాం. మనం ప్రేమించే వాణ్ణి పట్టుకు వదలం. అసూయ పడతాం. దగ్గర లేకుంటే బాధపడతాం. అతను మరణిస్తే మనకి పూర్తిగా మతి పోతుంది. అప్పుడు మరో రూపంలోనో, ఏదో నమ్మకంలోనో, ఇంకేదో ప్రత్యామ్నాయంలోనో సౌఖ్యాన్ని పొందాలని ఆశిస్తాం. ఇదంతా ప్రేమేనా? ప్రేమ ఒక ఊహ కాదు. సాంగత్య ఫలితం కాదు. మనకున్న దుస్థితి నుంచి పారిపోవటానికి ఉపయోగించుకునేది కాదు ప్రేమ. దాన్ని అలా ఉపయోగించినప్పుడు సమస్యల్ని సృష్టిస్తాం. వాటికి పరిష్కారాలుండవు. ప్రేమ ఊహజనితం కాదు. భావం, మనస్సూ ప్రముఖ అంశం కాకుండా ఉన్నప్పుడే నిజమైన దాన్ని అనుభవం పొందటం సాధ్యమవుతుంది.


43. ఒకే రీతిగా ఉండటం

ఆయన తెలివైనవాడు, చురుకైనవాడు. ఏవో కొన్ని ఎంచుకున్న పుస్తకాలు చదువుతూ ఉంటాడని స్పష్టమవుతోంది. వివాహితుడైనా, సంసార తాపత్రయం ఉన్నవాడు కాదు. తను ఆదర్శవాదిననీ, సంఘ సేవకుడననీ తనే చెప్పుకున్నాడు. రాజకీయ కారణాలవల్ల జైలుకి వెళ్లాడుట. ఎంతో మంది స్నేహితులున్నారుట. తనకు గాని, తన పార్టీకి గాని పేరు తెచ్చుకోవాలనే బాధ లేదు ఆయనకి. ఆ రెండూ ఒకటిగానే గుర్తిస్తాడాయన. ఆయనకి సంఘసేవలోనే నిజమైన ఆసక్తి ఉంది - అదైనా మానవ కల్యాణానికి దారి తీస్తుందేమోనని. దైవతత్పరత ఉన్నవాడని చెప్పవచ్చును. కాని, ఆవేశపరుడూ, మూఢవిశ్వాసాలు ఉన్నవాడూ కాదు. ఒక ప్రత్యేక సిద్ధాంతంలో గాని, ఆచారంలో గాని నమ్మకం ఉన్నవాడు కాదు. వైరుధ్యం అన్న సమస్య గురించి - తనలోని వైరుధ్యమే కాక, ప్రకృతిలోనూ, ప్రపంచంలోనూ ఉన్నదాన్ని గురించి చర్చించటానికి వచ్చానన్నాడు. ఈ వైరుధ్యం అనివార్యమైనదని ఆయనకి అనిపిస్తున్నదట. తెలివైనది, తెలివి తక్కువది, మనిషిలో ఉండే పరస్పర విరుద్ధమైన కోరికలు, మాటకీ, ఆచరణకీ, మాటకీ, భావానికీ - ఈ విధంగా వైరుధ్యం ప్రతి చోటా కనిపిస్తుందన్నాడు.