ఈ పుట ఆమోదించబడ్డది

పీచు తీసిన కొబ్బరికాయకు పైన మూడు రంధ్రాలు పెంకుతో కప్పబడి వుంటవి. వాటిపైన పీచు మాత్రం తియ్యరు (అది దేవ రహస్యం). ఆ మూడు రంధ్రాలలోను ఏదో ఒక రంధ్రంపైన గల పొర అతి సూక్ష్మంగా వుంటుంది. దాన్ని కనిపెట్టి, సిరంజీ ద్వారా ఏ విలువైన సెంటునో దాని లోపలికి పంపించి వుంచాలి. పైన గల పీచుమాత్రం పోకూడదు. అ తరువాత ప్రేక్షకుల్ని ఒక పీచుగల కొబ్బరికాయను తెమ్మని చెప్పి, దాన్ని ప్రదర్శకుడు కొంచెంసేపు మంత్రించినట్లగా నటించి, వారికిచ్చి కొట్టమనాలి. అప్పుడక్కడే వున్న ప్రదర్శకుడి అసిస్టెంటు - పీచు తీసి ఇవ్వగలనని చెప్పి, వారి వద్దగల కాయను తీసుకొని, పీచు (లాగుచున్నట్లుగా నటించి) లాగివేసి, కాయ ఇవ్వవలసి వచ్చినప్పుడు మాత్రం అంతకు పూర్వం సిద్ధంచేసి వుంచిన కాయను ఇస్తాడు. ఈలోగా ప్రేక్షకుల దృష్టిని తన మాటల ద్వారా ప్రదర్శకుడు మరల్చవలసి ఉంటుంది. ఇదంతా చెకచెకా క్షణాలమీద జరిగిపోతుంది మాటలు వినే ధ్యాసలో అసిస్టెంటు ఇచ్చిన కొబ్బరికాయ తమదని బ్రాంతినందిన ప్రేక్షకులు - ఆ కాయ పగలకొట్టి, అందలి సువాసనలకు, సుగంధాలకు ఉబ్బితబ్బిబ్బు కాగలరు. మిగిలిన ప్రేక్షకులంతా ప్రదర్శకుని వేనోళ్ళ కొనియాడకుండా వుండలేరు.